Begin typing your search above and press return to search.

2024 టార్గెట్ క్రాక్ చేయటానికి బ్లూప్రింట్ రెఢీ చేసిన బాబు

By:  Tupaki Desk   |   23 Aug 2021 10:54 AM GMT
2024 టార్గెట్ క్రాక్ చేయటానికి బ్లూప్రింట్ రెఢీ చేసిన బాబు
X
గెలుపునకు మించిన ఆత్మవిశ్వాసం మరొకటి ఉండదు. ఓటమికి మించిన నిరాశ మరొకటి ఉండదు. ఓటమిలో గెలుపు మార్గాన్ని ఎంచుకొని.. అలుపెరగని పోరాటం చేసిన వారికి అంతిమంగా విజయం సాధించే వీలుంది. నిరాశలో కూరుకుపోవటం వల్ల మరింత ఇబ్బందే తప్పించి.. ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. 2019లో జరిగిన ఎన్నికల్లో కలలో కూడా ఊహించని దారుణ పరాజయాన్ని రుచి చూశారు చంద్రబాబు. అధికారంలో ఉన్న వేళ..తనకు తిరుగులేదని.. గెలుపు ధీమా బాబులో చాలా ఎక్కువగా కనిపించేది.

ఎవరైనా జాగ్రత్తపడమని సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తే.. తన లెక్కల్ని వారికి చెప్పి.. నో డౌట్ బ్రదర్.. గెలుపు మనదేనంటూ చిద్విలాసం చిందించేవారు. అంతటి ఆత్మవిశ్వాసం కాస్త ఒక్కదెబ్బకుపోవటమే కాదు.. తీవ్రమైన నిరాశలో బాబు కూరుకుపోయారని చెబుతారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్న వేళ.. ఆయన సర్కారు తీరును బద్నాం చేయటానికి చాలా పాట్లు పడుతున్నారు చంద్రబాబు. కానీ.. అవేమీ వర్కువుట్ కాని పరిస్థితి.

అయినా భవిష్యత్తు మీద ఆశలు వదులుకోకుండా.. తిరిగి అధికారంలోకి రావాలన్న పట్టుదల బాబులో స్పష్టంగా కనిపిస్తోంది. 74 ఏళ్ల వయసులోనూ ఆయన భవిష్యత్తు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేసే తప్పులు తనకు కలిసి వస్తాయన్న ఆలోచనతో ఉన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో తమదే విజయమన్న విషయాన్ని ఆయన చెప్పటం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తనకు ఎదురైన చేదు అనుభవాలు.. జగన్ సామర్థ్యం ఏమిటన్నది అర్థమైన వేళ.. ఈసారి మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికలకు ఏడాది ముందు రెండు యాత్రలతో పార్టీని మళ్లీ పట్టాల మీదకు తీసుకురావాలన్న ఆలోచనలో బాబు ఉన్నట్లు చెబుతారు. ఒక యాత్రను తానే సొంతంగా చేయాలని.. రెండో యాత్రను మాత్రం తన రాజకీయ వారసుడు లోకేశ్ చేత చేయించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతారు. ఈ రెండు యాత్రలతో ప్రజల్లోకి వెళ్లటం.. పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేలా ప్లాన్ సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఈ రెండు యాత్రలు ఏపీ మొత్తం కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ రెండు యాత్రలు ఎలా ఉండాలి? రూట్ మ్యాప్ ఏమిటన్న దానిపై ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు చేసే యాత్ర బస్సు యాత్రగా ఉంటుందని చెబుతున్నారు. 74 ఏళ్ల వయసులో పాదయాత్ర లాంటి దానికి ఆయన ఆరోగ్యం సహకరించే అవకాశం లేదంటున్నారు. శారీరకంగా ఇప్పటికే యోగా.. ఎక్సర్ సైజులు చేస్తూ ఫిట్ గా ఉండే ప్రయత్నం చేస్తుంటారని.. తినే ఆహారం కూడా చాలా తక్కువగా తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 74 ఏళ్లు ఏమీ పెద్ద వయసుగా భావించాల్సిన అవసరం లేదంటున్నారు.

ఇక.. లోకేశ్ విషయానికి వస్తే.. ఆయన తన యాత్రను సైకిల్ యాత్రగా చేస్తారని చెబుతున్నారు. పార్టీసింబల్ అయిన సైకిల్ యాత్ర చేయటం ద్వారా.. ప్రజలకు దగ్గరగా వెళ్లే వీలుందని చెబుతున్నారు. గతంలో బొద్దుగా ఉండే లోకేశ్.. తాజాగా బాగా సన్నబడటమే కాదు.. తన మాట తీరును కాస్త మార్చుకున్నారనే చెప్పాలి. గతంలో మాదిరి.. ఆయన ప్రసంగాల్లో తప్పులు తక్కువగా దొర్లుతున్నాయి.

అంతేకాదు.. జగన్ మీద ఆయన ప్రదర్శించే కోపం.. ఆగ్రహం కామెడీ చేసుకునేలా కాకుండా.. మంట పుట్టేలా ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆయన మరింత మారాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారంలో ఉన్న వేళలో లోకేశ్ కు.. తాజాగా తగులుతున్న ఎదురుదెబ్బలు.. చేదు అనుభవాలు ఆయన్ను ప్రభావితం చేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. రెండు యాత్రలతో 2024 ఎన్నికల టార్గెట్ ను క్రాక్ చేస్తామన్న ధీమాలో ఉన్నట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.