Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ తప్పుచేశారా... ఏమి చెప్పదలచుకున్నారు బాబూ...?

By:  Tupaki Desk   |   12 Oct 2022 9:04 AM GMT
ఎన్టీయార్ తప్పుచేశారా... ఏమి చెప్పదలచుకున్నారు బాబూ...?
X
ఎన్టీయార్ కారణ జన్ముడు రణ జన్ముడు అని మహా కవి డాక్టర్ సి నారాయణరెడ్డి ఒక సందర్భంలో చాలా గొప్పగా చెప్పారు. ఆయన సినీ వైభోగం అంతా రారాజుగా సాగింది. రాజకీయాల్లో ఘన విజయాలు ఎన్నో అందుకున్నారు కానీ తన అసలైన ప్రత్యర్ధులను గుర్తించడంలో ఆయన విఫలం కావడం వల్లనే రెండు సార్లు వెన్నుపోట్లకు గురి అయ్యారు. తొలి వెన్నుపోటుకు తేరుకోవడం వల్ల నాదెండ్ల భాస్కరరావు మీద తెలుగు జనాలకు పెద్దగా ఇంత అయితే వ్యతిరేకత రాలేదు.

మలి వెన్నుపోటు ఏకంగా ఫ్యామిలీ మెంబర్స్ చేయడం, దానికి చంద్రబాబు నాయకత్వం వహించడం ఆ మీదట అతి కొద్ది నెలలు బతికిన ఎన్టీయార్ విషాదకరమైన పరిస్థితుల్లో మరణించడం వల్ల పాతికేళ్ళు పై బడిన ఆ మచ్చ చంద్రబాబుని వెంటాడుతోంది. టీడీపీని పరిరక్షణ కోసమే నాడు ఎన్టీయార్ నుంచి పదవి లాక్కున్నామని చంద్రబాబు ఎన్నో సార్లు చెప్పారు. కానీ ఇన్నేళ్ల తరువాత అంటే 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత ఆయన కొత్త విషయాలను చెబుతున్నట్లుగా అన్ స్టాపబుల్ రియాల్టీ షో ప్రోమో ద్వారా తెలుస్తోంది.

ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడవకముందు ఆయన కాళ్ళు పట్టుకున్నామని చంద్రబాబు చెప్పడం ప్రోమోలో చూపించారు. అంతే కాదు ఎన్టీయార్ నా ఆరాధ్య దైవం అని కూడా బాబు అన్నట్లుగా చూపించారు. ఇక ఈ నెల 14న ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది అపుడు బాబు ఏం చెబుతారు అన్నది చూడాలి. అయితే ఈ ప్రోమోలో కనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే ఎన్టీయార్ కాళ్ళు పట్టుకున్నా కరగలేదు అందుకే అనివార్యంగా ఆయన్ని దించేశామని ఏదో బాబు చెప్పబోతున్నారు అన్నది అర్ధమవుతోంది.

దీని మీదనే నెటిజన్లు ఒక్క లెక్కన కామెంట్స్ చేస్తున్నారు. కాళ్ళు పట్టుకున్నది బతిమాలడానికా లేక కాళ్లు గుంజేసి కుర్చీ లో నుంచి దించేయడానికా అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇక వెన్నుపోటు ఎపిసోడ్ లో మరో కీలకమైనది వైస్రాయ్ హొటల్ ఉదంతం. నాడు అక్కడికి వెళ్ళిన ఎన్టీయార్ మీద చెప్పులు ఎందుకు వేయించారు అన్నది కూడా ఇపుడు నెటిజన్ల నుంచి వస్తున్న మరో ప్రశ్న. ఎన్టీయార్ మాట వినలేదు సరే అని అధికారం గుంజుకున్నారు, మరి పెద్దాయన మీద చెప్పులు ఎందుకు వేయించాల్సి వచ్చిందో వివరిస్తారా అని కూడా అడుగుతున్నారు.

ఇక ఎన్టీయార్ కి వెన్నుపోటు 1995 ఆగస్ట్ లో జరిగితే ఆయన 1996 జనవరి 18 దాకా బతికి ఉన్నారు. ఆ సందర్భంగా పలు చానళ్లలో ఎన్టీయార్ చంద్రబాబు తన పార్టీలో ఆషాడభూతిగా చేరి తనను మోసం చేశారని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఎన్నికల ముందే ఆయన టీడీపీని చీల్చాలని చూశారని కూడా ఆరోపణ చేశారు. 1994 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీకి ఇంత పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని బాబు అసలు ఊహించలేదని, దాంతో ఆయన ఎనిమిది నెలల పాటు సర్దుకుపోయినట్లుగా ఉండి చివరికి తన వారితోనే తన మీద తిరుగుబాటు చేయించి పదవి తీసుకున్నారని ఎన్టీయార్ అప్పట్లో ఆరోపించారు.

అలాగే చంద్రబాబును ఔరంగజేబుతో కూడా ఎన్టీయార్ పోల్చారు. మరి ఎన్టీయార్ నాడు ఆరోపించిన వాటికి అపుడే బాబు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదన్న ప్రశ్న కూడా ఇపుడు వేస్తున్నారు. అలాగే ఎన్టీయార్ పదవి తీసుకున్న తరువాత ఆయన ఫోటోలను కూడా చాలా కాలం పాటు పార్టీ ఆఫీసులో కనిపించకుండా చేశారని, మరి ఎన్టీయార్ ఆరాధ్య దైవం అయితే ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందని కూడా అడుగుతున్న వారూ ఉన్నారు.

ఇన్నాళ్ళూ చెప్పని విషయాలు ఇపుడు చెబుతున్నారా లేక తమ తప్పు లేదని చెప్పి ఎన్టీయార్ దే తప్పు అని చాటడానికి చూస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్టీయార్ తప్పు నిజంగా చేసినా పెద్దాయనను ఆ వయసులో అలా ఘోరంగా అవమానించడాన్ని ఎలా సమర్ధించుకుంటారని కూడా అంటున్నారు. నాడు అసెంబ్లీలో తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని ఎన్టీయార్ కోరినా ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటో కూడా చెప్పాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2024 ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా టీడీపీకి ఉన్నాయి.

దాంతో ఆహా ఫ్లాట్ ఫారం మీద ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ ని ముందు పెట్టి తమ తప్పు లేదని బాబు చెప్పుకోవడానికి ఆలా వేదికగా చేసుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఎన్టీయార్ వెన్నుపోటు అన్నది రాజకీయ చరిత్రలో ఒక మచ్చ లాంటిది. చంద్రబాబు చెబుతున్నట్లుగా ఎన్టీయార్ వినకపోయి ఉండవచ్చుకూడా. కానీ దానికి వేసిన శిక్ష మాత్రం ఘోరం అనే వారే ఆనాటి ఘటనలు చూసిన వారు అంటున్నారు. మరి బాబు ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ ని సమర్ధిస్తూ ఇంకేమి చెబుతారో చూడాల్సి ఉంది అంటున్నారు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.