Begin typing your search above and press return to search.

బాబు గారి మాట : వారసత్వం...లోకేష్...టీడీపీ...?

By:  Tupaki Desk   |   2 Jun 2022 12:30 AM GMT
బాబు గారి మాట : వారసత్వం...లోకేష్...టీడీపీ...?
X
టీడీపీ వారసత్వాన్ని ధిక్కరించి పుట్టిన పార్టీ. కుక్క మూతి పిందెలు, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారు అని కాంగ్రెస్ వారిని నిందిస్తూ ఊరూరా తిరిగి ఎన్టీయార్ చాటి చెప్పిన పార్టీ. వారసత్వం మీద నమ్మకం లేదు అంటూనే అధికారంలోకి వచ్చాక ఎన్టీయార్ ఇద్దరు అల్లుళ్ళనూ పక్కన పెట్టుకున్నారు. 1987లో చిత్తూరు జిల్లా మదనపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బాలయ్య స్పీచ్ చూసి అతడే నా రాజకీయ వారసుడు అని ఆనందం ఆపుకోలేక ప్రకటించినదీ ఎన్టీయారే.

ఇక మరో దశలో ఆయన నాకు వారసులు ఏవరూ లేరు, పార్టీ నాతోనే పుట్టింది నాతోనే పోతుంది అని కూడా చెప్పేవారు. ఇక రెండవ వివాహం చేసుకున్నాక లక్ష్మీ పార్వతీ తెలివైనది అంటూ ఒక విధంగా ఆమెను అన్నింటా ప్రోత్సహించి వారసత్వ పోటీలోఉండేలా చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆయన అల్లుడుగానే చంద్రబాబు పాపులర్ అయ్యారు.

ఆయన ముఖ్యమంత్రి అయ్యారూ అంటే అది ఎన్టీయార్ పెట్టిన పార్టీలో ఉండడం వల్లనే సాధ్యపడింది అని అంతా అంటారు. లేటెస్ట్ గా చూస్తే ది ప్రింట్ అనే మీడియా చంద్రబాబుని ఇంటర్వ్యూ చేసినపుడు వారసత్వ రాజకీయాల మీద చాలా గడుసుగానే బాబు మాట్లాడారు. రాజకీయాలే కాదు, ఏ రంగమైనా వారసత్వం అన్నది ఒక్కటే సహాయం చేయదు అని బాబు అన్నారు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అపుడే ఎవరైనా రాణిస్తారు అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో వారసులు రాకుండా నియంత్రించలేమని కూడా అన్నారు. అదే టైమ్ లో వారిని బలవంతాన తీసుకువచ్చి పెట్టలేమని కూడా చెప్పారు.

లోకేష్ టీడీపీకి తదుపరి అధినేత అవుతారా అన్న దాని మీద బాబు ఈ రకంగా స్పందించారు. ఒక విధంగా బాబు చెప్పిన మాటలలో చాలా అంశాలు ఉన్నాయి. వారసుడుగా ఉంటూనే ప్రతిభ చాటాలని ఆయన చెప్పినట్లుగా అర్ధం చేసుకోవాలి. అదే టైమ్ లో టీడీపీ నాలుగు దశాబ్దలా పార్టీ అని ఎన్నో సవాళ్ళను చూసిందని కూడా ఆయన అన్నారు.

ఈ పార్టీ ఎందరికో అవకాశాలు ఇచ్చిందని, ఎంతో మంది యువకులు కూడా వాటిని అందుకున్నారని చెప్పారు. మొత్తానికి చూస్తే లోకేష్ తన రాజజీయ వారసుడు అని బాబు డైరెక్ట్ గా సూటిగా మాత్రం చెప్పలేదు. అయితే దీని మీదనే నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

కేవలం వారసుడు అన్న ట్యాగ్ ఉంటే సరిపోదు అవకాశాలు రావు అన్న చంద్రబాబు కనీసం ఎమ్మెల్యే కాకుండానే ఎలా లోకేష్ ని తెచ్చి అయిదు శాఖల మంత్రిని చేశారు అని అడుగుతున్నారు. ప్రతిభ ఉండాలని సవాళ్ళను ఎదుర్కోవాలని చెబుతున్న బాబు టీడీపీలో లోకేష్ ని నంబర్ టూ గా ప్రొజెక్ట్ చేయడం లేదా అని కూడా నిలదీస్తున్నారు.

ఇక తన ముందు రాజకీయాల్లో ఎవరూ లేరని, తాను ఒక రైతు బిడ్డని అని అలాంటి తాను ఈ స్థాయిని వచ్చాను అంటే స్వయం ప్రతిభతోనే అని బాబు చెప్పారు. ఆయన ఎంత ప్రతిభావంతుడైనా ఎన్టీయార్ అల్లుడు ట్యాగ్ తోనే వచ్చారు కదా అన్నదే నెటిజన్ల కామెంట్స్.

ఇక ఏజ్ విషయంలో కూడా తాను ఇప్పటికీ యంగే అన్నట్లుగా చంద్రబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. నరేంద్రమోడీదీ తనదీ ఒక్కటే వయసు అని ఆయన చెప్పడం విశేషం. ఇక పొత్తుల విషయంలో ఏదీ చెప్పకుండా బాబు తప్పించుకోవడం ఇక్కడ చూడాలి. అలాగే యాంటీ బీజేపీ కూటమిలో ఉంటూ కేసీయార్ తో కలసి పనిచేస్తారా అన్న దానికి కూడా సూటిగా జవాబు చెప్పని బాబు తనకు ఏపీయే ముఖ్యమని మాత్రం చెప్పి తప్పించుకున్నారు.