Begin typing your search above and press return to search.

పరామర్శ వేళ.. చంద్రబాబు అండ్ కోకు తప్పిన పెను ప్రమాదం

By:  Tupaki Desk   |   22 July 2022 2:41 AM GMT
పరామర్శ వేళ.. చంద్రబాబు అండ్ కోకు తప్పిన పెను ప్రమాదం
X
వరద ప్రాంతాల్లో కష్టాలు పడుతున్న బాధితుల్ని పరామర్శించేందుకు ఏపీ విపక్ష నేత చంద్రబాబు  షెడ్యూల్ ను సిద్ధం చేసుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఈ మాట చంద్రబాబు వయసును పరిగణలోకి తీసుకొని చెబుతున్న మాట. సాధారణంగా డెబ్భైలకు దగ్గరకు వస్తున్నారంటే చాలు.. అధినేతలు ఎవరూ కూడా క్షేత్రస్థాయిలో కాలు మోపేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎవరిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకుంటే.. 68 ఏళ్ల వయసులో ఉన్న ఆయన.. ప్రజలు ఏదైనా విపత్తులో చిక్కుకుంటే.. తనకు తానుగా బయటకు రావటానికి పెద్దగా ఇష్టపడరు.

వరద కారణంగా భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో.. బాధితుల్ని పరామర్శించేందుకు ఆయన లగ్జరీ బస్సులో వెళ్లటం.. ఆ తర్వాత హెలికాఫ్టర్ లో ప్రయాణించటం చేశారు. బాధితుల్ని కలిసినా.. వారితో గడిపిన సమయం తక్కువ. వారి ఇండ్లకు వెళ్లి.. వారి సమస్యల్ని కళ్లారా చూసింది కూడా తక్కువే. ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలి భిన్నంగా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడాయన వయసు 72 ఏళ్లు. ఆయన పదేళ్లు విపక్షంలో ఉన్న వేళలో విపత్తులు చోటు చేసుకుంటే.. పగలు..రాత్రి అన్న తేడా లేకుండా తిరగటం చూశాం. ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనూ ఇలాంటి పరిస్థితి.

ఇప్పుడీ వయసులో.. విపక్ష నేతగా ఉండి కూడా ఉదయం మొదలు పెట్టి రాత్రి పది గంటలు దాటిన తర్వాత కూడా బాధితుల పరామర్శలో ఉండటం సాహసం కాక మరేంటి? విశ్రాంతి అన్నది లేకుండా కష్టపడటం ఒకఎత్తు అయితే.. ప్రమాదాల గురించి పెద్దగా ఆలోచించకుండా.. ముందుకువెళ్లటం చంద్రబాబులో కనిపిస్తుంది. ఆయన ప్రమాదాల పక్కనే నడుస్తారన్న దానికి నిదర్శనంగా తాజా పరామర్శల్నే చెప్పొచ్చు.

పశ్చిమగోదావరి జిల్లా పర్యటన అనంతరం వశిష్ఠ గోదావరి నదిలో ప్రయాణించారు. ఇందుకోసం అత్యాధునిక.. వసతులు ఉన్న బోటులో ప్రయాణించలేదు. సాదాసీదా పంటులో ప్రయాణించారు. నిజానికి జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నేతలు ఎవరూ కూడా ఇలాంటి సాహసాలు చూసేందుకు ఇష్టపడరు. మీద పడుతున్న వయసును పట్టించుకోకుండా.. మధ్యవయస్కుడైన ముఖ్యమంత్రి హుషారుకుఏ మాత్రం తగ్గకుండా ఆయన తిరిగే తీరు చూస్తే.. ఆయన ఫిట్ నెస్ కు అసూయపడకుండా ఉండలేరు.

బాధితుల్నిపరామర్శించేందుకు వీలుగా పంటులో ప్రయాణించిన చంద్రబాబు అండ్ కోకు సోంపల్లి రేవు వద్ద గట్టుకు చేరుతున్న వేళలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.అయితే.. చుట్టూ ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పాలి. పంటులో నుంచి మర పడవలోకి మారే క్రమంలో మొదట చంద్రబాబు.. కొంతమంది నేతలు మరపడవలోకి వచ్చారు. అనంతరం ఆయనతో వచ్చిన టీడీపీ నేతలు.. మీడియా ప్రతినిధులు పంటు దిగేందుకు అమర్చిన చెక్కపైకి చేరారు.

అదే సమయంలో దాని గొలుసు తెగిపోయి..ఒకపక్కకు ఒరిగిపోయింది. ఇదంతా సెకన్ల వ్యవధిలో చోటుచేసుకుంది. ఆ సమయానికి బల్ల మీద మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు.. పితాని సత్యనారాయణ.. ఉండి ఎమ్మెల్యే రామరాజు.. మాజీ ఎమ్మెల్యే రాధాక్రిష్ణ.. ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్ రావు.. శ్రీను.. మంతెన సత్యనారాయణ రాజుతో పాటు పలువురు మీడియాప్రతినిధులు నీటిలోకి జారిపోయారు.

దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. మత్స్యకారులు లైఫ్ జాకెట్లు విసిరి.. వారిని సురక్షితంగా పడవలోకి చేర్చారు. నిజానికి ఈ ఘటన గోదావరి ఒడ్డుకు సమీపంలో చోటుచేసుకోవటంతో పెను ముప్పుత్రుటిలోతప్పింది. ఒకవేళ.. వేరే చోట జరిగి ఉంటే మాత్రం ఊహించటానికి వీల్లేని రీతిలో ప్రమాదం ఉండేదన్న మాట వినిపిస్తోంది. ఇదంతా విన్నప్పుడు ఈ వయసులో చంద్రబాబు..బాధితుల పరామర్శ కోసం ఎలాంటి సాహసాలు చేస్తున్న విషయం ఇట్టే అర్థమవుతుంది.