Begin typing your search above and press return to search.

చంద్రబాబు -దగ్గుబాటి పలకరింపు

By:  Tupaki Desk   |   10 Dec 2021 10:33 AM GMT
చంద్రబాబు -దగ్గుబాటి పలకరింపు
X
ఎప్పుడో 25 ఏళ్ల క్రితం .. ఇద్దరూ సమఉజ్జీలుగా ఉండేవారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు కుడి ఎడమ భుజాలుగా మెలిగేవారు. పలు సంక్షోభాల్లో పార్టీని నడిపించారు. పలు ఎన్నికల్లో బాధ్యతలు మోశారు. 1995 ఆగస్టు సంక్షోభంలోనూ కలిసే సాగారు. అయితే, ఆ తర్వాతే తేడా వచ్చింది. పూర్తిగా విడిపోయారు. వారే.. ఎన్టీఆర్ అల్లుళ్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

పాతికేళ్ల తర్వాత

1995 పరిణామాల అనంతరం విబేధాలు వచ్చి ఇద్దరు ఎడమొహం పెడమొహంగా మారారు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా కాగా.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తానన్నప్పటికీ దగ్గుబాటి మొగ్గుచూపలేదు. టీడీపీ కి మొత్తానికి దూరంగా జరిగారు.

దగ్గుబాటి, ఆయన భార్య పురంధేశ్వరి 1999 ఎన్నికల సమయంలో మౌనంగా ఉన్నా.. 2004 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ లో చేరారు. వెంకటేశ్వరావు ఎమ్మెల్యే కాగా పురందేశ్వరి ఎంపీగా గెలిచారు. పురంధేశ్వరి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల చేశారు.

2014కు మారిన పరిణామాలు

2014లో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో ఓటమి పాలయింది. రాష్ట్ర విభజన పరిణామాలతో పురంధేశ్వరి బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. ప్రస్తుతం కూడా బీజేపీ నాయకురాలుగానే ఉన్నారు. దగ్గుబాటి మాత్రం వైసీపీ వైపు మొగ్గారు. ఆయన కుమారుడు ఆ పార్టీలో చేరారు.

మళ్లీ ఇప్పుడు

రాజకీయంగా దారులు మారిన తోడళ్లులు చాలాకాలం తర్వాత ఎదురుపడ్డారు. అంతేకాదు ఆప్యాయంగానూ పలకరించుకున్నారు. ఎన్టీఆర్ మనవరాలి వివాహ వేడుక ఇందుకు వేదికైంది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి కుమార్తె ను శుక్రవారం పెళ్లి కూతురిని చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

అదే సమయంలో చంద్రబాబు,దగ్గుబాటి పరస్పరం పలకరించుకుని.. ఫొటో కూడా దిగారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి కూడా ఆ ఫోటోలో ఉన్నారు.