Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు.. వారి గురించి మ‌రిచారా?

By:  Tupaki Desk   |   18 Aug 2015 12:50 PM GMT
చంద్రుళ్లు.. వారి గురించి మ‌రిచారా?
X
ప్ర‌పంచంలో ఎక్క‌డ‌.. ఏ మూల తెలుగువాళ్ల‌కు ఎలాంటి ఆప‌ద వ‌చ్చినా తామున్నామ‌న్న‌ట్లుగా చెప్పుకునే తెలుగు ముఖ్య‌మంత్రులిద్ద‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. లిబియాలోని న‌ర‌రూప రాక్ష‌సులైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల చెర‌లో ఉన్న ఇద్ద‌రు తెలుగు ప్రొఫెస‌ర్ల‌కు సంబంధించిన అంశంపై వారిద్ద‌రూ ప‌ట్ట‌న‌ట్లుగా ఉంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వారిని విడిపించేందుకు త‌మ వంతుగా.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉన్నా.. అలాంటివేమీ చేయ‌లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే వారి విడుద‌ల కోసం ఆయా కుటుంబాల‌కు చెందిన వారు ప్ర‌ధాని మోడీ.. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ ల‌ను క‌లిసి త‌మ గోడు వినిపించారు. రోజులు గ‌డుస్తున్నా వారి జాడ దొర‌క‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో.. బాధిత కుటుంబాల వారు ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాల‌ని భావిస్తున్నారు.

ఈ అంశంపై మొద‌ట స్పందించిన‌ట్లే క‌నిపించిన ఏపీ అధికార‌ప‌క్షం నేత‌లు.. త‌ర్వాత నుంచి ఈ విష‌యంపై మాట్లాడ‌టం మానేశారు. ఈ ఇద్ద‌రికి సంబంధించిన తాజా స‌మాచారం యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యం నుంచి కానీ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కానీ రాలేద‌ని ప్రొఫెస‌ర్ బ‌ల‌రామ్ స‌తీమ‌ణి శ్రీదేవి వాపోతున్నారు. త‌మ వాళ్లు క్షేమంగా వ‌స్తార‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబ స‌భ్యుల వ్య‌ధ మాట‌ల్లో చెప్ప‌లేనంత దారుణంగా ఉందంటున్నారు. ఇప్ప‌టికైనా తెలుగు ముఖ్య‌మంత్రులిద్ద‌రూ ఈ వ్య‌వ‌హారాన్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకుంటే మ‌ళ్లీ ఈ వ్య‌వ‌హారంలో కాస్తంత క‌ద‌లిక వ‌చ్చే వీలుంద‌న్న వాద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.