Begin typing your search above and press return to search.

బాబుకు ఆహ్వానం : మోడీ కరుణించారా... ఏం జరుగుతోంది అసలు...?

By:  Tupaki Desk   |   30 Jun 2022 9:36 AM GMT
బాబుకు ఆహ్వానం : మోడీ కరుణించారా... ఏం జరుగుతోంది అసలు...?
X
అటు మోడీ ఇటు చంద్రబాబు. ఈ ఇద్దరు మధ్యన నాలుగేళ్ళుగా మాటలు లేవు. మంతనాలు అసలు లేవు. కనీసం ఫోన్ లో కూడా ముచ్చటించిన సందర్భాలు లేవు. బాబు ఢిల్లీకి వెళ్ళినా కూడా మోడీ అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేనే లేదు. ఒక విధంగా ఒకనాటి ఇద్దరు మిత్రులు ఇపుడు వేరు బాట పట్టారు. మోడీ బాబు జోడీ ఏపీలో ప్రగతికి దారి అని 2014లో ఇచ్చిన నినాదాలు అన్నీ కనుమరుగు కాగా మోడీ మీద బాబు అన్న మాటలు, చేసిన విమర్శలే హైలెట్ అయ్యాయి.

ఫలితంగా మోడీ బాబుని పట్టించుకోవడంలేదు అంటారు. ఇక ఏపీ సీఎం గా జగన్ ఉన్నారు. ఆయనకు చంద్రబాబుతో అసలు పడదు, పైగా సన్నిహిత మిత్రుడిగా జగన్ బీజేపీకి ఉన్నారు. రేపటి ఎన్నికలలోనూ అలాగే ఉంటారు. 2024లో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి సాయం చేయడానికి కూడా జగన్ నే బీజేపీ నమ్ముకుంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో బాబుకు ఎక్కడా చోటు లేదు. దాంతో బాబు సైతం విసిగి వేసారి ఉన్నారని, తన దారి తాను చూసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇలాంటి నేపధ్యంలో సడెన్ గా కేంద్రం నుంచి టీడీపీకి ఒక అహ్వానం వచ్చింది. జాలై నాలుగున భీమవరం వేదికగా జరిగే అల్లూరి 125వ జయంతి ఉత్సవాలతో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పాల్గొనే కార్యక్రమానికి బాబును ఆహ్వానిస్తూ ఒక లేఖ పంపించారు.

దాంతో బాబు మీద మోడీకు కరుణ కలిగిందని, ఇక ఈ కొత్త బంధం రేపటి రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుందో అన్న చర్చ ఒక వైపు జోరుగా సాగుతోంది. అయితే అంతలోనే మరో భారీ ట్విస్ట్ ఇచ్చేశారు. కేంద్రం నుంచి లేఖ వచ్చిన తరువాత కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి నేరుగా బాబుకు ఫోన్ చేసి ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి మీ పార్టీ తరఫున ప్రతినిధిని పంపించండి అని కోరారట‌.

అంటే బాబుని రమ్మని కోరకుండా ప్రతినిధి వస్తే సరిపోతుంది అని కేంద్ర పెద్దలు అభిప్రాయపడ్డారు అంటున్నారు. ఈ పరిణామాలతో ఈ ఊహాగానాలు ఆశలు అన్నీ మళ్లీ మారిపోయి కధ మొదటికి వచ్చేసింది అంటున్నారు. చంద్రబాబు సైతం దీనిని గమనించి తమ పార్టీ తరఫున ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుని భీమవరం ప్రోగ్రాం కి పంపుతున్నారని తెలుస్తోంది.

నిజానికి చూస్తే కేంద్రం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రంలో భాగంగా గ్రాండ్ లెవెల్ లో మన్యం వీరుడు అల్లూరి జయంతి ఉత్సవాలను చేస్తోంది. దాంతో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో పాటు గుర్తింపు ఉన్న పార్టీలకు ఈ ఇన్విటేషన్ అందుతోందిట.

అందువల్ల మోడీ బాబుని దగ్గరకు తీస్తున్నారు అని కానీ ఆయన మీద మునుపటి కోపాన్ని మరచి స్నేహ హస్తాన్ని చాచారు అని కానీ అనుకోవడానికి ఏ మాత్రం వీలు లేదనే అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు మోడీ జోడీ అని 2024లో మళ్లీ నినదించవచ్చు అనుకున్న వారికి ఈ వార్తలు మాత్రం నిరాశనే కలిగించాయి అనుకోవాలి.