Begin typing your search above and press return to search.

అప్పుడు చంద్రబాబు-ఇపుడు మోడి ... సేమ్ టు సేమ్

By:  Tupaki Desk   |   13 Aug 2021 5:04 AM GMT
అప్పుడు చంద్రబాబు-ఇపుడు మోడి ... సేమ్ టు సేమ్
X
జగన్మోహన్ రెడ్డితో అప్పుడు చంద్రబాబునాయుడు ఇపుడు నరేంద్రమోడి ఆటాడుకుంటున్నారు. ఇద్దరు కూడా జగన్ తో ఆడుకునేందుకు సబ్జెక్టు ఒకటే కావటం గమనార్హం. ఇంతకీ విషయం ఏమిటంటే వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైన విషయం అందరికీ తెలిసిందే. తిరుగుబాటు ఎంపిపై అనర్హత వేటు వేయించాలని గడచిన ఏడాదిగా జగన్ అండ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నారు.

ఎంపిపై అనర్హత వేటు వేయించటం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు పెద్ద విషయం కాదు. కానీ అందుకు మోడి దగ్గర నుండి క్లియరెన్సు కావాలి. మోడి నుండి క్లియరెన్సు రాదని అనుకున్నారో ఏమో వైసీపీ ఎంపిలు రూటు మార్చి పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంపిలపై చర్యలు తీసుకోవటానికి కచ్చితమైన గడువు విధించేట్లుగా రాజ్యాంగ సవరణ చేయాలంటు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపిలు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు ఓ వినత పత్రం ఇచ్చారు.

సరే ఓంబిర్లా దగ్గర కానిది కిరణ్ ద్వారా అవుతుందా ? అంటే అవదనే చెప్పాలి. ఎందుకంటే కేంద్రం స్ధాయిలో ఏమన్నా జరగాలంటే మోడి తలచుకుంటేనే అవుతుందని అందరికీ తెలిసిందే. జగన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎంపి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటు కోర్టులో పిటీషన్లు వేశారు. జగన్ కు వ్యతిరేకంగా దేశంలో ఎన్ని ఫోరంలున్నాయో అన్నింటికీ ఫిర్యాదులు చేశారు. దీంతో జగన్ కు ఏదో అయిపోతుందని కాదుకానీ ఇద్దరి మధ్య వివాదం రోజు రోజుకు పెరిగిపోతందన్నది వాస్తవం.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మోడి లేదా బీజేపీ సహకారం లేకుండా జగన్ పై ఎంపి ఈ స్ధాయిలో రెచ్చిపోయే అవకాశమే లేదు. సరే ఇక రాష్ట్రానికి వస్తే గతంలో చంద్రబాబు కూడా జగన్ పై ఇలాగే రెచ్చిపోయారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, 3 ఎంపిలను టీడీపీలోకి లాగేసుకున్నారు. నిసిగ్గుగా ఫిరాయింపు ఎంఎల్ఏల్లో నలుగురికి మంత్రిపదవులు కూడా ఇచ్చారు. ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని జగన్ అండ్ కో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ కు లేఖలు రాసినా ఉపయోగం కనబడలేదు.

అప్పట్లో కోడెల కూడా చంద్రబాబు చెప్పినట్లు వినేమనిషే కాబట్టి అనర్హతపై ఐదేళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు జనాలే ఫిరాయింపులపై చర్యలు తీసుకున్నారులేండి అది వేరే సంగతి. అంటే అప్పట్లో ఎంఎల్ఏలపై అనర్హత వేటుకు ప్రయత్నించింది, ఇపుడు తిరుగుబాటు ఎంపిపై అనర్హత వేటు వేయించేందుకు నానా అవస్తలు పడుతున్నది జగనే. మొత్తానికి అనర్హత వేటు విషయంలో అప్పట్లో చంద్రబాబు ఓ ఆటాడుకుంటే ఇఫుడు అదే సబ్జెక్టు మీద మోడీ కూడా జగన్ను ఆటాడుకుంటున్నట్లే ఉన్నారు.