Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఫ్రెండ్స్ అయిపోతోన్న బాబు -ప‌వ‌న్‌..!

By:  Tupaki Desk   |   16 Dec 2021 7:30 AM GMT
మ‌ళ్లీ ఫ్రెండ్స్ అయిపోతోన్న బాబు -ప‌వ‌న్‌..!
X
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్నేహం ఎప్పుడు కొనసాగుతుందో ? ఎప్పుడు ముగుస్తుందో ? కూడా ఎవరికీ అర్థం కావడంలేదు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి మరి తనకు మద్దతు ఇవ్వమని స్నేహహస్తం చాటారు. ఆ ఎన్నికలకు ముందు పవన్ జనసేన పార్టీ పెట్టినా ఎన్నికల్లో పోటీ చేయకుండా మరి చంద్రబాబుని గెలిపించాలని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ తర్వాత రెండేళ్ళపాటు టీడీపీతోనే పవన్ ఉన్నారు. ఆ త‌ర్వాత‌ టీడీపీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని తీవ్రంగా విమర్శించారు. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు సమానదూరం ఒంటరిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తిరిగి బీజేపీతో జ‌త‌క‌ట్టారు.

అయితే ఇప్పుడు బీజేపీ కూడా పవన్ ను ఎంతవరకు గౌరవిస్తుదో ? చూస్తూనే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పవన్ టిడిపితోనే జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నారన్న‌... గుసగుసలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ - బాబు ఒకే వేదిక మీద‌కు రానున్నట్టు తెలుస్తోంది.

న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన రైతులు ఈ నెల 17వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని ముందు నుంచి అనుకున్నారు.

అయితే స్థానిక పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు. అమరావతి రైతులతో పాటు జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించి మరి ఈ బహిరంగ సభకు అనుమతి తెచ్చుకున్నారు. 17వ తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటలలోగా ఈ స‌భ‌ పూర్తి కావాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ బహిరంగ సభకు చంద్రబాబు వస్తున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆయన తిరుపతి చేరుకోనున్నారు.

మరో విచిత్రమేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ సభకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. జనసేన వర్గాల నుంచి ఇప్పటికే సమాచారం కూడా బయటకు పొక్కింది. రాజధానిగా అమరావతినే ఉంచాలని సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న రైతులు అందరు కూడా న్యాయస్థానం దేవస్థానం పేరుతో చేసిన పాదయాత్ర కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే వారు పవన్ బహిరంగ సభకు రావాలని నాదెండ్ల మనోహర్ ద్వారా రాయబారం పంపినట్టు తెలుస్తోంది.

పవన్ కూడా బీజేపీతో తేల్చుకునేందుకు ఈ బహిరంగ సభకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప‌వ‌న్ - చంద్రబాబు మళ్ళీ తిరిగి ఒకే వేదిక మీద‌కు రానున్నారు. ఇదే బాటలో వీరిద్ద‌రు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు