Begin typing your search above and press return to search.

పవన్ కి సీఎం కిరీటం... బాబు అల్టిమేట్ స్ట్రోక్ 

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:43 AM GMT
పవన్ కి సీఎం కిరీటం... బాబు అల్టిమేట్ స్ట్రోక్ 
X
ఏపీ రాజకీయాలు ఇపుడు రసకందాయంలో పడుతున్నాయి. ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతున్న జగన్ చంద్రబాబుల మధ్య రాజకీయ సమరంలో పవన్ కళ్యాణ్ జనసేనతో మూడవ పక్షంగా వస్తున్నారు. అయితే ఏపీలో రెండు ప్రధాన పార్టీలను ఒకేసారి ఎదుర్కొని సీఎం కావడం అంటే అది కష్టమైన వ్యవహారం. పైగా దానికి టైం చాలా పడుతుంది.

అందుకే పవన్ తనదైన రాజకీయంతో మరో వైపు నుంచి నరుక్కువస్తున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే జగన్ సీఎం కాకూడదు అన్న చంద్రబాబు రాజకీయ బలహీనత పవన్ కి వరంగా మారబోతోంది అని అంటున్నారు. అలాగే కేంద్రంలోని మోడీ సర్కార్ కి జగన్ చంద్రబాబు లేని ఏపీని చూడాలన్న కోరికకూ ఆలంబన పవనే కావడంతో జనసేనాని రొట్టె విరిగి నేతిలో పడుతుందా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది.

నిజానికి జనసేనకు బలమంతా పవన్ మాత్రమే. ప్రధాన పార్టీలతో పోలిస్తే నిలిచి గెలిచే సత్తా ఇంకా లేదు కానీ జగన్ బాబుల మధ్య ఉన్న అతి తీవ్రమైన రాజకీయ ఘర్షణల వల్లనే గుర్రం ఎగరవచ్చు అన్నట్లుగా మధ్యలో సీఎం రేసులోకి పవన్ వచ్చినా రావచ్చు అని అంటున్నారు. పవన్ కి ఈ రకమైన డిమాండ్ పెరగడానికి మరో కారణం ఆయనకు జగన్ పట్ల ఉన్న శాశ్వతమైన శత్రుత్వం. ఇది రాజకీయ ప్రత్యర్ధిని మించి ఉంది.

దాంతో చంద్రబాబు పవన్ని నమ్మడానికి ఇది సరిపోతోంది. మరో వైపు చూస్తే పవన్ డిమాండ్ పెంచే మరో అంశం కేంద్రంలోని మోడీకి కూడా ఆయన కావాలని కోరుకోవడం. దాంతో తాము వదిలేస్తే బీజేపీ కూడా ఆయన్ని తమ వైపు తీసుకుపోతుంది అన్న ఆదుర్దా కూడా చంద్రబాబు చేత పవన్ సీఎం అని అనిపించే ప్రయత్నం చేస్తున్నాయా అంటే రాజకీయం కాబట్టి ఆలోచించాల్సిందే.

ఇంకోవైపు చూస్తే రాజకీయాల్లో ఎపుడు ఏమైనా జరగవచ్చు. చంద్రబాబుకు కాపుల మద్దతు శాశ్వతంగా దక్కాలన్న ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అంటున్నారు. అది నెరవేరాలి అంటే ఆయన ఇంతకు ముందు తన మంత్రివర్గంలో కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్లుగా కాకుండా ఒకసారి అయినా సీఎం సీట్లో కూర్చోబెడితే తెలుగుదేశం జీవితకాలం దాన్ని క్రెడిట్ ఖాతాలో వేసుకుని చెప్పుకోవడానికి ఉంటుంది.

అలా కాపుల మద్దతు కూడా తెలుగుదేశానికి పూర్తి కాలం ఉంటుంది. మరి చంద్రబాబుకు సీఎం పదవి కొత్త కాదు, పైగా ఆయనకు తెలుగుదేశం ముఖ్యం. అదే టైం లో తన వారసుడు లోకేష్ భవితవ్యం ముఖ్యం. ఏపీలో కాపులకు సీఎం పదవి ఇస్తే కనుక అది శాశ్వత పెట్టుబడిగా తెలుగుదేశానికి మారి లోకేష్ కి రాచబాట అవుతుంది అన్న లెక్కలు కూడా బాబుకు ఉన్నాయని అంటున్నారు.

ఇక తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల కాపులు టోటల్ గా ఈ వైపునకు రారు. అదే పవన్ ని ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెబితే కచ్చితంగా వారంతా టర్న్ అవుతారు. అపుడు తెలుగుదేశం సేన కూటమి బంపర్ విక్టరీ కొడుతుంది. ఇలా చంద్రబాబు అల్టిమేట్ స్ట్రోక్ నే జగన్ కి ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీజేపీఎకి కాపు రాజకీయాలు చేయకుండా కూడా చెక్ పెట్టేందుకు బాబు పవన్ని తన వైపునకు తిప్పుకుంటున్నారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో 2019లో తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిన పవన్ కి ఈసారి లక్ కలసి వస్తే సీఎం అయ్యే చాన్స్ దక్కుతుంది అని అంటున్నారు. ఒక వైపు బీజేపీ మరో వైపు టీడీపీ సీఎం చేస్తామని చెబుతూంటే పవన్ మాత్రం తెలివిగా ఓటు బ్యాంక్ గట్టిగా ఉన్న తెలుగుదేశం వైపే మొగ్గుతున్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు టీడీపీ అధినేతగా ఉండగా తన పార్టీ పొత్తు పెట్టుకున్న మరో పార్టీకి సీఎం పదవి అప్పగించి పక్కకు జరిగి కూర్చుంటారు అంటే అది రాజకీయాల్లో అద్భుతమే అవుతుంది. ఏపీలో అలాంటి అద్భుతం జరుగుతుందా అంటే వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.