Begin typing your search above and press return to search.
పక్కన పవన్... బెబ్బులిలా గర్జించిన బాబు!
By: Tupaki Desk | 18 Oct 2022 4:35 PM GMTచాలా కాలానికి ఆ కాంబోని చూసే అవకాశం ఏపీ ప్రజలకు దక్కింది. ఏపీలో అయిదేళ్ళ క్రితం టీడీపీ జనసేన బంధానికి కటీఫ్ అయింది 2017న తన పార్టీ ఆవిర్భావ సభను గుంటూరులో నిర్వహించినపుడు పవన్ అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతే కాదు ఆయన కుమారుడు అప్పటి మంత్రి లోకేష్ మీద కూడా సంచలన ఆరోపణలు చేశారు.
దాంతో నాడు ఏపీలో రాజకీయ సమీకరణలు ఒకసారిగా మారిపోయాయి. దాని ఫలితంగా 2019 ఎన్నికల్లో జనసేన వేరుగా పోటీ చేసింది. టీడీపీ ఒంటరి పోరుకు రెడీ అయి పోటీ చేస్తే 23 సీట్లు దక్కాయి. పవన్ రెండు చోట్ల ఓటమి పాలు అయ్యారు. ఆయన పార్టీ ఒకే ఒక సీటుని సాధించిది. ఇక 2020 జనవరిలో బీజేపీతో పవన్ పొత్తు కుదుర్చుకున్నారు. కానీ టీడీపీతో మాత్రం బంధాన్ని కంటిన్యూ చేయలేదు.
అయితే ఆయన ఏనాడూ టీడీపీని ఎక్కడా 2019 ఎన్నికల తరువాత విమర్శించినది లేదు. అలాగే టీడీపీ సైతం పవన్ని మిత్రపక్షంగానే చూస్తూ వస్తోంది. దీంతో ఏపీలో ఈ రెండు పార్టీలు మళ్లీ కలుస్తాయన్న చర్చ సాగుతూ వచ్చింది. అది ఇన్నాళ్ళకు ఒక విధంగా సాకరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఒక విధంగా పొత్తులకు బీజం పడినట్లే అంటున్నారు.
ఇక విజయవాడలో పవన్ బస చేసి ఉన్న హొటల్ కి తానూ స్వయంగా వెళ్ళి ఆయనతో చర్చలు జరిపిన చంద్రబాబు అనంతరం మీడియా సమావేశంలో ధాటీగా ప్రసంగం చేయడం విశేషం. ఒక విధంగా బాబులో ఎన్నడూ చూడని ఉత్సాహం కనిపించింది. రేపటి రోజున ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో గెలుపు తనదే అని బాబు ధీమా కూడా కనిపించింది. ఆయన ఎక్కడా తడుముకోకుండా ఆవేశపూరితంగా తన ప్రసంగం చేస్తూ ఏపీ సర్కార్ ని మొత్తానికి మొత్తం చీల్చి చెండాడారు.
అంతే కాదు ఆయన బొబ్బిలి పులిలా గర్జిస్తూ వైసీపీ ఇక ఇంటికే అన్నట్లుగా సంకేతాలు పంపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం బలోపేతానికి తాను ముందుండి అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నం అవుతాను అని పెద్దన్నగా హింట్ ఇచ్చారు. వారూ వీరూ అని చూడకుండా ఎలాంటి భేషజాలు పెట్టుకోకుండా అంతా ఏకం కావాల్సిన తరుణం ఇదే అని బాబు పిలుపు ఇవ్వడం విశేషం.
అంతే కాదు సహనానికి మారు పేరుగా ఉన్న తనను కూడా బరస్ట్ అయ్యేలా చేసిన వైసీపీ పెద్దలు ఇపుడు సినిమాల్లో తప్ప బయట ఎలాంటి ఆవేశం చూపించని పవన్ కూడా బరస్ట్ అయ్యేలా చేశారూ అంటే అంతకంటే దారుణం లేదని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని నిన్న నాకు నేడు పవన్ కి జరిగిన ఈ నిర్బంధం రేపు మరో నేత మీద కూడా జరుగుతుందని, అందుకే అంతా చేతులు కలపాలని ఆయన కోరడం విశేషం.
ఈ మీడియా సమావేశం పాతిక నిముషాలకు పైగా సాగితే పవన్ జస్ట్ అయిదు నిముషాలు మాత్రమే మాట్లాడగా చంద్రబాబు మాత్రం సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. ఏపీలో వైసీపీ లాంటి నీచమైన పార్టీని తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
అయితే ఎక్కడా ఎన్నికలు పోటీ పొత్తులు అన్న మాట లేకుండా బాబు ప్రసంగం సాగితే పవన్ సైతం జస్ట్ ఇది కర్టసీ మీట్ అన్నట్లుగానే మాట్లాడారు. ఆ తరువాత మరిన్ని సార్లు సమావేశం అవుతామని పవన్ చెప్పడం ద్వారా తమ బంధం గట్టిపడుతోంది అన్న సంకేతాలు అయితే పంపించగలిగారు.
ఇక ఇంకో వైపు చూస్తే అసంఖ్యామైన పవన్ ఫ్యాన్స్ అయితే ఈ మీడియా సమావేశం జరిగినంతసేపూ పవన్ కి జై కొడుతూ నినాదాలు చేయడం విశేషం. చంద్రబాబు సైతం ఎక్కడా విసుగు చెందకుండా వారికి అభివాదాలు చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొత్తానికి పవన్ పక్కన ఉంటే తాను మళ్ళీ బొబ్బిలి పులే అన్నట్లుగా బాబు దూకుడు చేయడం అయితే మీడియా మీట్ లో స్పష్టంగా కనిపించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.