Begin typing your search above and press return to search.

జగన్ని చికాకు పెట్టిన బాబు పవన్

By:  Tupaki Desk   |   31 Dec 2022 4:30 PM GMT
జగన్ని చికాకు పెట్టిన బాబు పవన్
X
వైసీపీ అధికారంలోకి 151 సీట్లతో వచ్చింది. ఆ మెజారిటీని చూసిన వారు అంతా మరో టెర్మ్ ఖాయం అని అనుకున్నాను. దానికి తోడు తొలి ఆరు నెలలూ సాఫీగా పాలన సాగింది. ఎపుడైతే జగన్ మూడు రాజధానులు నినాదం అందుకున్నారో నాటి నుంచి కొంత ఇబ్బంది మొదలైంది. ఈ లోగా కరోనా వచ్చి అతలాకుతలం చేసింది. ఇలాంటి ఆటంకాలు ఎన్ని ఉన్నా 2020, 2021 రెండేళ్ళూ ఏకపక్షంగా జగన్ ఏలుబడి సాగింది.

జగన్ని రాజకీయంగా దెబ్బ తీయలేమని ఒక దశలో విపక్షాలు వచ్చేసే సీన్ కూడా ఏర్పడింది. కానీ 2022 మాత్రం అలా లేదు. వైసీపీని మూడు చెరువుల నీళ్ళు తాగించింది. ఈ ఏడాది వస్తూనే ఉద్యోగుల చలో విజయవాడ ఆందోళనతో సర్కార్ ని హడలెత్తించింది. ఆ తరువాత కరోనా బాగా తగ్గడంతో విపక్షం బయటకు వచ్చింది.

తెలుగుదేశం పార్టీ బాదుదే బాదుడు అంటూ ఏప్రిల్ లో స్టార్ట్ చేస్తే దానికి మంచి రెస్పాన్స్ లభించింది. దానికి ముందు జనసేన పార్టీ మీటింగ్ సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చమని చెప్పి వైసీపీ పెద్దలకు కళ్ళ ముందే భవిష్యత్తు కనిపించేలా చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా సూపర్ హిట్ అయింది. దాంతో తెలుగుదేశం పార్టీ గేర్ ఒక్కసారిగా మార్చేసింది.

ఇక అధికార పార్టీ ప్లీనరీ కూడా ఇదే ఏడాది జరిగినా కూడా అధికారం చేతిలో ఉన్న వేళ ఆ హంగులు అన్నీ అందులోకే వస్తాయి. పైగా ప్లీనరీ హిట్ అయినా విపక్షాలు దూకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. పవన్ వీకెండ్ పాలిటిక్స్ కూడా కాక రేపుతూ గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చింది. పవన్ కళ్యాణ్ చేపట్టిన మరో కార్యక్రమం రైతు భరోసాకు మంచి స్పందన రావడంతో అధికార వైసీపీ ట్రబుల్స్ లో పడినట్లు అయింది.

వీటికి మించి పరాకాష్ట విశాఖలో పవన్న్ని ఒక హొటల్ లో ఉంచడం దానికి ప్రతిగా ఆయన విజయవాడ వచ్చి బిగ్ సౌండ్ చేయడం ఆనక తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కి బాసటా నిలవడం అన్నది వైసీపీకి మింగుడు పడని రాజకీయమే అయింది.

మరో వైపు ఇదేమి ఖర్మ అంటూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న మరో కార్యక్రమం కూడా జనాలోకి వెళ్ళింది. ఈ మధ్యలో అనుహ్య పరిణామం ఏంటి అంటే విపక్షాల సభలకు జనాలు వెల్లువలా తరలిరావడం. చంద్రబాబు ఎక్కడ మీటింగ్ పెట్టినా అది బంపర్ హిట్ అవుతోంది. జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఏదో మార్పు దిశగా రాజకీయం సాగుతోందా అన్న చర్చ అయితే 2022లో మొదలైంది. ఒక్క మాటలో చెప్పుకోవాలీ అంటే 2022లో వైసీపీ ఏకపక్ష రాజకీయానికి ఆ పార్టీ గెలుచుకున్న లోకల్ బాడీ ఎన్నికలు, ఉప ఎన్నికల విజయాలకు అన్నింటికీ చెక్ పెట్టేలా తెలుగుదేశం జనసేన రెండూ తెగ చికాకు పెట్టేశాయి.

ఇక ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్లుగా 2023లో అసలైన సినిమా ఉంది అంటున్నారు. పవన్ వారాహి వాహనం ఎక్కి ఏపీ అంతా తిరిగే పరిస్థితులు ఉంటాయి. అలాగే లోకేష్ పాదయాత్రలో ఏపీ రాజకీయం ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి 2022 వైసీపీకి ముందు ముందు రాజకీయం అంత ఈజీ కాదు అని చెప్పేలా సాగింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.