Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి మీద చంద్రబాబు గుస్సా... ?

By:  Tupaki Desk   |   3 Nov 2021 1:30 PM GMT
మాజీ మంత్రి మీద చంద్రబాబు గుస్సా... ?
X
చంద్రబాబుని ప్రాక్టికల్ పొలిటీషియన్ అంటారు. ఆయన డిక్షనరీలో శత్రువులు ఉండరు, ప్రత్యర్ధులు కూడా అసలు ఉండరు, ఆయన అందరితోనూ మంచి రిలేషన్స్ ఉండేలా చూసుకుంటారు. ఇక సొంత పార్టీలో కూడా చంద్రబాబు ఎవరినీ కాదని పక్కన పెట్టరు, ఇక చంద్రబాబుని ఆయన పార్టీని వదిలి బయటకు వెళ్ళి ఘాటుగా విమర్శలు చేసిన వారిని సైతం ఆదరించే గుణం బాబుకే ఉంది. అలా ఒకసారి పార్టీ విడిచి 2009 ఎన్నికల ముందు ప్రజరాజ్యంలోకి వెళ్ళిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి టీడీపీలో చేరుతానంటే బాబు మనస్పూర్తిగా ఆహ్వానం పలికారు. ఆయనకు, ఆయన వర్గానికి కోరిన సీట్లు ఇవ్వడమే కాకుండా గంటాను అయిదేళ్ల పాటు మంత్రిగా చేశారు.

మరి గంటా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే నాటి నుంచి ఫుల్ సైలెంట్ అయ్యారు. దాంతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసన అంటూ ఆ మధ్యన రాజీనామా చేసి అధినాయకత్వానికే ఖంగు తినిపించారు. ఈ విషయంలో కనీసం హై కమాండ్ కి కూడా చెప్పకుండా సొంత డెసిషన్ తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతాయి. ఇక తాజాగా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే చంద్రబాబు ముప్పయి ఆరు గంటల పాటు ఆందోళన చేశారు. ఏపీలోని పదమూడు జిల్లాల టీడీపీ నేతలు అంతా వచ్చి ఆ దీక్షలో పాలు పంచుకున్నా గంటా వెళ్ళలేదు. తన తరఫున ఉత్తర నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న నేతను పంపించి ఊరుకున్నారు.

అదే టైమ్ లో దాడులు ప్రజాస్వామ్యంలో మంచివి కావు అంటూ జగన్ కి లేఖ రాసారు. అయితే ఈ చర్యలు మాత్రం టీడీపీ అధినాయకత్వానికి పెద్దగా నచ్చలేదు అంటున్నారు. గంటా వంటి బలమైన నేత ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి ఆందోళనలు చేయాలని హై కమాండ్ అభిప్రాయపడుతోంది. కానీ ఆయన మాత్రం తనదైన వ్యూహాలతో ఉన్నారు. దీంతో చంద్రబాబు కూడా గంటా పోకడల మీద గుస్సా అవుతున్నారని టాక్. దాంతో గంటా పార్టీని పక్కన పెడితే తామెందుకు ఆయన్ని పట్టించుకోవాలి అన్న ఆలోచనలో టీడీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.

మరి చంద్రబాబు ఈసారి ఎన్నికల వేళ కచ్చితంగా ఉంటారని, వైసీపీ పాలన మీద ధైర్యంగా బయటకు వచ్చి పోరాడిన వారికే టికెట్లు ఇస్తారని అంటున్నారు. ఇదే విషయం మీద మాజీ మంత్రి, విశాఖజిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు కూడా కష్టపడిన వారికీ, వైసీపీ సర్కార్ పెట్టిన బాధలను తట్టుకుని ఉద్యమించిన వారికే బాబు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం విశేషం. గంటాకు అయ్యన్నకు పడదు అన్న సంగతి ఈ సందర్భంగా ప్రస్థావనార్హం. మొత్తానికి చూస్తే గంటాకు బాబు షాక్ ఇస్తారా అన్న చర్చ అయితే పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది మరి.