Begin typing your search above and press return to search.

పిసకాల్సిన అవసరం లేదు.. బాబు లాంటి విజన్ ఉన్న అధినేత ఉంటే?

By:  Tupaki Desk   |   17 Dec 2022 8:30 AM GMT
పిసకాల్సిన అవసరం లేదు.. బాబు లాంటి విజన్ ఉన్న అధినేత ఉంటే?
X
టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఇప్పుడు అధికారం లేదు. ఆ మాటకు వస్తే వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో చెప్పటం ఇప్పుడు అతిశయోక్తే అవుతుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అలాంటి వేళలో.. అంచనాల్ని సీరియస్ గా వెల్లడించే వారెవరూ కూడా తమ నోటి నుంచి అంచనాల్ని ఇట్టే చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు. కారణం.. ఏడాదిన్నర కాలంలో చోటు చేసుకునే పరిణామాల్ని మదింపు చేయటం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు.

అందుకే.. రాజకీయం మీద అవగాహన ఉన్న వారికి.. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న మాటకు ప్రైవేటు సంభాషణల్లో కూడా సమాధానం చెప్పేందుకు ఇష్టపడరు. ఇదంతా ఎందుకంటే.. ఉత్తినే మాటలు చెప్పటం వేరు. విషయాల మీద అవగాహన ఉండి చెప్పటం వేరు.

చంద్రబాబు మాస్ నాయకుడు అనే కంటే కూడా అత్యుత్తమ పరిపాలనా దక్షత ఉన్న నాయకుడిగా ఆయన్ను చెప్పొచ్చు. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయన్న దానికి తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన రియాక్టు అయిన తీరును చూసినప్పుడు.. విజన్ ఉన్న వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి కదా? అన్న భావన కలుగక మానదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థను ఏర్పాటు చేసిన ఇరవైఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి చంద్రబాబును ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడే క్రమంలో ఐఎస్ బీకి ప్రస్తుతం డీన్ గా వ్యవహరిస్తున్న పిల్లుట్ల.. ఐఎస్ బీని ప్రపంచంలోనే టాప్ 10 బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా స్థానం సంపాదించటం కోసం తాము ప్రయత్నిస్తున్నట్లుగా చంద్రబాబుకు చెప్పారు. దీనికి వెంటనే స్పందించిన చంద్రబాబు.. 'నంబర్ 1 కావొచ్చు కదా?' అంటూ ప్రశ్నించిన వైనం చూసినప్పుడు.. విజన్ ఉన్న నాయకుడి లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుందన్నది చెప్పొచ్చు.

చంద్రబాబుకు మరీ ఇంత బాకా ఉదాల్సిన అవసరం ఉందా? మరీ ఇంతలా పిసికేయాల్సిన పనేంటి? అని కొందరు వ్యాఖ్యానించొచ్చు. కానీ.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే.. ఒక విజన్ ఉన్న నాయకుడి ఆలోచనలు ఎలా ఉంటాయి? లక్ష్యాలు సాదాసీదాగా పెట్టుకోరన్న విషయం కళ్ల ముందు కనిపించిన సందర్భంలో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండలేం కదా? అందుకే.. చంద్రబాబు మాటల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చింది.

ఐఎస్ బీకి చంద్రబాబు వచ్చిన సందర్భంగా.. క్యాంపస్ మొత్తాన్ని మరోసారి చూసేందుకు ఆసక్తి ప్రదర్శించటం ఒక ఎత్తు అయితే.. ఆయన్ను చూసేందుకు అక్కడి వారు ప్రదర్శించిన ఆసక్తి చూసినప్పుడు బాబుకు ఉన్న ఇమేజ్ ఎంతన్నది అర్థమవుతుంది. అంతేకాదు.. ఆయన ప్రసంగించిన సమయంలో పలుమార్లు ప్రాంగణంలో ఉన్న వారు హర్షధ్వానాలు చేయటమే కాదు.. ఎవరు చెప్పకుండానే తమకు తాము లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన తీరుచూస్తే.. కొన్ని వర్గాల్లో ఆయన పట్ల ఉన్న గౌరవ మర్యాదలు ఏమిటన్నది ఇట్టే అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే.. ఈ ఉదంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.