Begin typing your search above and press return to search.

అమరావతి దేవతల రాజధాని .. అమరావతి భూమి పూజ జరిగిన చోట చంద్రబాబు సాష్టాంగ ప్రణామం !

By:  Tupaki Desk   |   17 Dec 2020 10:35 AM GMT
అమరావతి దేవతల రాజధాని .. అమరావతి భూమి పూజ జరిగిన చోట చంద్రబాబు సాష్టాంగ ప్రణామం !
X
అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్టు ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ లో ప్రకటన చేసిన సమయం నుండే ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఏడాది నుంచి అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాయపూడిలో జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది అమరావతి జేసీఏ. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. బహిరంగ సభకు వెళ్లే ముందు అమరావతి రాజధానికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు చంద్రబాబు.

అయితే , చంద్రబాబు పర్యటన లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ సమస్య పరిష్కారం అయింది. ఈ పర్యటనకి వెళ్లేముందు చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవతల రాజధాని అయిన అమరావతిని కాపాడాలంటూ దుర్గమ్మను ప్రార్థించానని , ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఏడాది పాటు పూర్తయిన ఉద్యమాన్ని దుర్గమ్మ చూస్తూనే ఉందని, న్యాయం చేస్తుందన్నారు. ప్రజారాజధాని అమరావతి అందరికల అన్న చంద్రబాబు, దానిని విధ్వంసం చేస్తున్నారని ఎంతో ఆవేదన చెందారు. ఎన్నో విధాలుగా దాడులు చేసినా అమరావతిని కాపాడుకునేందుకు ఏడాదిగా పోరాడుతున్నారని అన్నారు. ఇక, దుర్గమ్మ దర్శనం అనంతరం ఉద్దండరాయునిపాలెం బయలుదేరిన చంద్రబాబు పర్యటనలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కరకట్టమీద నుంచి కాకుండా చంద్రబాబు రాజధాని ఉద్యమం సాగిన గ్రామాల మీదుగా ఆయన ఉద్దండరాయునిపాలేనికి బయలుదేరారు. రైతులు ఉద్యమాలు చేపట్టిన పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి దీక్షా శిబిరాల మీదుగా వెళ్తున్న చంద్రబాబును మల్కాపురం ,వెలగపూడి జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయునిపాలేనికి అనుమతి లేదంటూ రహదారిపై పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీనితో టీడీపీ ధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌లు పోలీసులతో చర్చలు జరిపారు. శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని తాము పవిత్రస్థలంగా భావిస్తున్నందున శాంతియుతంగా అక్కడకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. చర్చల అనంతరం చంద్రబాబు కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను మాత్రమే ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు అనుమతించారు.

ఇక , కొద్దిపాటి క్యాన్వాయ్ తోనే ఉద్దండరాయునిపాలేం ఉద్దండరాయునిపాలెంలోని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ ప్రధాని మోదీ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. యాగశాలలో మోకాళ్లపై ప్రణమిల్లి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. యాగశాలలోని హోమం జరిగిన ప్రదేశం వద్దే మోకరిల్లి కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు. శంకుస్థాపనలో భాగంగా పెట్టిన ప్రదేశాన్ని తిలకించారు. ఆ తరవాత రాయపూడి లో జరిగే జనభేరి సభకు చేరుకున్నారు. అమరావతి జనభేరీ సభలో చంద్రబాబు నాయుడు, విపక్షాలతో కలిసి కూర్చున్నారు. అనంతరం చంద్రబాబు సభనుద్దేశించి మాట్లాడారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అన్నారని, ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు జగన్ అని మండిపడ్డారు. త్యాగం చేసిన రైతులపై ఇష్టానుసారం మాట్లాడుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఇష్టమొచ్చినప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులా. పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి నీరు, మట్టి తీసుకొచ్చాం. ప్రధాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చారు. సాక్షాత్తు పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని ప్రధాని చెప్పారు. జగన్ గాలి కబుర్లు చెప్పడం ఇప్పటికైనా మానుకోవాలి అని చంద్రబాబు మాట్లాడారు.