Begin typing your search above and press return to search.

బాబు బడాయి... జీఎన్ రావుకు అక్షరాలు దిద్దించారట

By:  Tupaki Desk   |   23 Dec 2019 1:32 PM GMT
బాబు బడాయి... జీఎన్ రావుకు అక్షరాలు దిద్దించారట
X
టీడీపీ అధినేత. ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు నిజంగానే బడాయి బాబేనని చెప్పాలి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా... తనను తాను ఆకాశానికెత్తేసుకోవడంలో బాబును మించిన వారు మరొకరు ఉండరన్న వాదన కూడా ఉంది. ఇక నోరు తెరిస్తే.. హైదరాబాదును అభివృద్ధి చేసింది తానేనని నిత్యం చెప్పుకునే బాబు... ఆ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా అస్సలు పట్టించుకోరు. ఈ తరహా సైెల్ఫ్ డబ్బా బాగా అలవాటైపోయిన చంద్రబాబు... ఇప్పుడు ఏకంగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టేశారు. రాజధానిపై జగన్ సర్కారు ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ చంద్రబాబు... అసలు జీఎన్ రావు తన కింద పనిచేసిన వారేనని, అసలాయనకు అక్షరాలు దిద్దించింది తానేనన్న కోణంలో మాట్లాడేశారు. ఈ మాటలు వింటే... బాబు నిజంగానే బడాయి బాబు అని ఒప్పుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

అయినా ఈ సందర్బం ఎలా వచ్చిందన్న విషయానికి వస్తే... ఏపీ రాజధానిపై ప్రస్తుతం కొనసాగుతున్న రచ్చలో భాగంగా రాజధాని రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలకు మద్దతు పలికేందుకు సోమవారం అమరావతి ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు... రైతుల నిరసనలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు... జీఎన్ రావు కమిటీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జీఎన్ రావు కమిటీని నియమించిన జగన్ సర్కారును పెద్దగా టార్గెట్ చేయని చంద్రబాబు... అసలు జీఎన్ రావు కమిటీని ఎవరు నియమించారని, అసలు ఆ కమిటీ ఎవరిని సంప్రదించి నివేదిక రూపొందించిందని ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే విందాం పదండి.

"రాజధాని గురించి ఆయన ఎవరిని అడిగారు, అసలు ఆయన విశ్వసనీయత ఏంటి? జీఎన్ రావు కమిటీ వేసి, మూడు రాజధానులు ఉంటాయని అసెంబ్లీలో ముందుగా ప్రకటిస్తారు. అంటే, జీఎన్ రావు నివేదిక ఇవ్వకముందే ముఖ్యమంత్రిగారు పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత పరీక్షలు జీఎన్ రావు రాశాడు. ఏం చెప్పాలి తమ్ముళ్లూ, వీళ్లు ఎంత తెలివైనవాళ్లనాలి. జీఎవ్ రావు నివేదిక ఇచ్చాడంటే ఇక్కడెవరూ నమ్మరు. అది జగన్ రిపోర్టు. ఆ రిపోర్టును మన గొంతు కోయడానికి మనమీద ప్రయోగిస్తున్నారు. జీఎన్ రావు నా వద్ద పనిచేసిన అధికారే" అంటూ చంద్రబాబు తనదైన ఫ్లోలో ప్రసంగాన్ని దంచేశారు. పనిలో పనిగా ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు కానున్న విశాఖపై బాబు తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు విశాఖ అంటే ఎంతో ఇష్టమని, అది మంచివాళ్లుండే నగరం అని చంద్రబాబు అన్నారు. విశాఖతో పాటు అరకు, ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా తాము చర్యలు తీసుకున్నామని, అరకులో కాఫీ పండించి ఎగుమతులను ప్రోత్సహించామని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రధానికి ఆ కాఫీ గింజలతో తయారుచేసిన కాఫీని తానే సర్వ్ చేశానని చంద్రబాబు వెల్లడించారు.