Begin typing your search above and press return to search.

పవన్‌కు చంద్రబాబు ఫోన్‌.. దాని గురించేనా?

By:  Tupaki Desk   |   17 Oct 2022 5:21 AM GMT
పవన్‌కు చంద్రబాబు ఫోన్‌.. దాని గురించేనా?
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విశాఖ టూరు తీవ్ర ఉద్రికత్తలకు కారణమైన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలో విశాఖ గర్జన ముగించుకుని వస్తున్న వైసీపీ మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు దీన్ని ఆ పార్టీ కుట్రగా పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నారు. కోడి కత్తి తరహాలో వైసీపీ సానుభూతి కోసం డ్రామాలాడుతోందని మండిపడుతున్నారు.

తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు పవన్‌ను వైజాగ్‌ వదిలి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు వంద మంది జనసేన నేతలను అరెస్టు చేశారు. జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులపై ఇప్పటికే పలుమార్లు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అయితే పవన్‌ వైజాగ్‌ వదిలివెళ్లకుండా ప్రస్తుతం తాను బస చేసిన నోవాటెల్‌లోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలకతీతంగా పవన్‌కు మద్దతు లభిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. వైసీపీ చర్యలు అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ఒక పార్టీ అధినేత కూర్చోవాలో, నుంచోవాలో పోలీసులు ఎలా నిర్ణయిస్తారని మండిపడ్డారు. హోటల్‌లో సోదాలు నిర్వహించడం, జనసేన నేతలను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమని జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు దుర్మార్గమన్నారు.

అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నేతలను, కార్యకర్తలను విడుదల చేయాలని కోరారు. ర్యాలీకి అనుమతులు తీసుకున్న నేతలను అరెస్టు చేయడం, వారిపై హత్యాయత్నం కేసులు పెట్టడం దారుణమన్నారు.

అంతేకాకుండా చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పవన్‌ విభేదించాక ఆయనకు చంద్రబాబు ఫోన్‌ చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. జరిగిన పరిణామాలను పవన్‌.. చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. మద్దతు తెలిపినందుకు పవన్‌.. చంద్రబాబు, లోకేష్‌లతోపాటు పలువురు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తదితరులు కూడా వైసీపీ ప్రభుత్వ చర్యలను, జనసేన పార్టీ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. వీరందరికీ ఒక ప్రకటనలో పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ఓవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ నేతలు పవన్‌ కల్యాణ్‌కు ఫోన్‌ చేసి మద్దతు తెలియజేయడాన్ని బట్టి ఈ మూడు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీల్చబోనని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ మూడు పార్టీలు ఒక్కటవ్వడానికి పరిస్థితులు దోహదం చేస్తున్నాయని చెబుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.