Begin typing your search above and press return to search.

మూడు రాజధానులతో బాబు అడ్డంగా ఫిక్స్

By:  Tupaki Desk   |   19 Dec 2019 4:56 AM GMT
మూడు రాజధానులతో బాబు అడ్డంగా ఫిక్స్
X
విషయం ఏదైనా స్పష్టత చాలా ముఖ్యం. గోడ మీద పిల్లి వాటంగా ఉండేవారికి ఎప్పుడూ సమస్యలే. అవకాశానికి తగ్గట్లుగా మాటల్ని మార్చే వారికి వచ్చే తిప్పలు ఎలా ఉంటాయో ఏపీ విపక్ష నేత చంద్రబాబును చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. రాష్ట్ర విభజనకు ముందు రెండు కళ్ల సిద్ధాంతంతో ఆయన చెప్పిన మాటలు.. చేసిన చేష్టలు ఎంత ఎటకారంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఆంధ్రా.. తెలంగాణ రెండు తనకు రెండు కళ్లు లాంటివనన విషయాన్ని చంద్రబాబు పదే పదే చెప్పేవారు. రెండూ కావాలని వాదించేవారు. అదెలా కుదురుతుందన్న ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయేవారు. విభజన అనివార్యమైనప్పుడు ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఉంటే ఎవరో ఒకరు లాభపడేవారు. కానీ.. చంద్రబాబు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతం.. టెంకాయ చిప్పల వ్యూహాన్ని పదే పదే తెర మీదకు తెచ్చేవారు.

బాబు బలహీనతల గురించి బాగా తెలిసిన ఆయన రాజకీయ ప్రత్యర్థులు రెండు కళ్ల సిద్ధాంతంలో బాబును ఫిక్స్ చేసి తాము అనుకున్నట్లే రాజకీయప్రయోజనాన్ని పొందితే.. బాబు కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. విభజన వేళలో బాబును ఎలా అయితే ఫిక్స్ చేశారో.. ఇప్పుడు మూడు రాజధాననుల పేరుతో జగన్ సర్కారు కూడా బాబును మస్తుగా ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఎందుకంటే.. 3 రాజధానుల్ని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన బాబుకు దిమ్మ తిరిగే షాక్ గా మారిందని చెప్పాలి. ఏపీలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలని చెప్పటం ద్వారా రాజధానికి సంబంధించి మూడు ప్రాంతాల్లోని వారిని ఏకకాలంలో సంతోషానికి గురి చేశారని చెప్పాలి.

ఈ మూడు రాజధానుల మాటన విపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే.. ఒక హద్దు దాటితే.. మూడు ప్రాంతాల వారి ఆగ్రహానికి గురి కావొచ్చని చెబుతున్నారు. చూస్తూ.. చూస్తూ తన కలల పంట అయిన అమరావతిని తప్పించి మరే రాజధానిని బాబు సమర్థించే అవకాశం లేదు. అలాంటివేళలో.. ఉత్తరాంధ్రతో పాటు.. కర్నూలుకు చెందిన వారంతా బాబుపై మరింత గుర్రు పెరగటం ఖాయం.

రాజధాని ప్రకటనతో తమ ప్రాంతం డెవలప్ కావటానికి ఉన్న అవకాశాన్ని బాబు చెడగొడుతున్నారన్న భావనకు ఆయా ప్రాంతాల ప్రజలు అనుకోవటం ఖాయం. ఓవైపు మూడు రాజధానుల్ని బాబు వ్యతిరేకిస్తున్నా.. ఆయన పార్టీకి చెందిన సీనియర్ నేతలు పలువురు స్వాగతిస్తున్న వైనాన్ని మర్చిపోకూడదు. ఇలాంటివేళ.. తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన బాబు ఎలా బుక్ అయ్యారో.. తాజా ఎపిసోడ్ లోనూ మూడు ప్రాంతాల్లో రాజధానుల్ని ఏర్పాటు చేయటంతో పాటు.. దానిపై ఎక్కువకాలం వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితిని ఏపీ సర్కారు తీసుకొచ్చిందని చెప్పక తప్పదు.