Begin typing your search above and press return to search.

బాబు స్టైల్ మార్చారా? కొత్త తీరుతో శ్రేణులకు స్థైర్యం

By:  Tupaki Desk   |   4 Oct 2021 12:30 AM GMT
బాబు స్టైల్ మార్చారా? కొత్త తీరుతో శ్రేణులకు స్థైర్యం
X
చేతికి కోటి రూపాయిలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కోటి మాట నోటి నుంచి వస్తే వచ్చే ధీమా వేరుగా ఉంటుంది. పలు విషయాల్లో డబ్బు మాట పని చేస్తుంది. కానీ.. అంతకు మించిన మనో ధైర్యాన్ని ఇచ్చే తీరు చాలా అవసరం. రాజకీయాల్లో ఇది మరింత అవసరం. పవర్ లో ఉన్నప్పుడు అధినాయకత్వం నుంచి ఇలాంటి అవసరం పెద్దగా ఉండదు. కానీ.. విపక్షంలో ఉన్నప్పుడు చాలా ముఖ్యం. ఈ విషయాన్ని ఏపీ విపక్ష నేత చంద్రబాబు తాజాగా గుర్తించినట్లు చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఆయన తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. నేతలకు.. పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే.. తమ దృష్టికి వచ్చినంతనే ఆయన స్పందిస్తున్నారు. ప్రమాదాలకు గురైనా.. అనారోగ్యానికి గురైనా.. అనుకోనిరీతిలో మరణించినా.. రాజకీయ ప్రత్యర్థుల నుంచి వేధింపులకు గురవుతున్నా.. దౌర్జన్యాల బారిన పడుతున్నా.. ఆయన నుంచి వెంటనే ఫోన్ కాల్ రావటం ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ లో కొత్త హుషారును ఇస్తోంది.

తమ కష్టాల్ని.. బాధల్ని అధినాయకుడి వరకు వెళ్లి.. ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో వారిలో స్థైర్యాన్ని పెంచేలా చేస్తోంది. అంతేకాదు.. గతంలో మాదిరి ముక్తసరిగా మాట్లాడటం.. అన్ని తనకు తెలుసన్నట్లుగా వ్యవహరించటం లాంటి తీరును సైతం మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఆవేశంతోనూ.. ఆవేదనతోనూ బాధితులు చెప్పే మాటలన్నింటిని ఓపిగ్గా వింటున్న ఆయన.. వారికి ఎలాంటి సాయం అవసరమవుతుందన్న విషయాన్ని సైతం అడిగి.. చేతనైనంతగా చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు.. న్యాయపరంగానూ సాయం చేస్తామని ఆయన ఇస్తున్న మాట.. పార్టీ క్యాడర్ లో ఊరటను ఇస్తుందని చెబుతున్నారు. ఏపీలో అధికారపక్షం బలంగా ఉందని.. వారిని ఏమీ చేయలేరన్న మాట టీడీపీ శ్రేణుల్ని నిరాశలోకి నెడుతున్నాయి. ఇలాంటివేళ.. బాబు చేస్తున్న ప్రయత్నం వారికి కొత్త ఆశలకు అవకాశం ఇస్తోందని చెబుతున్నారు. తమకు ఏదైనా అయితే పార్టీ వింటుంది.. అండగా నిలుస్తుందన్న ధైర్యం ఇతరులకు కలుగుతోంది.

గతంలో ఒక స్థాయి నేతలకు మాత్రమే చంద్రబాబు పరామర్శ లభించేది. అందుకు భిన్నంగా ఇప్పుడు నేత.. కార్యకర్త అన్న తేడా లేకుండా.. పార్టీకి చెందిన ఏ స్థాయి వారైనా సరే.. రాజకీయ శత్రుత్వంతో ఇబ్బందులకు గురవుతుంటే ఆయన నేరుగా మాట్లాడేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబుకు కుదరకపోతే.. ఆయన బాధ్యతను నారా లోకేశ్ తీసుకుంటున్నారు. దీంతో.. పార్టీ కోసం మరింత శ్రమించి పని చేయటానికి.. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటానికి అవసరమైన మానసిక స్థైర్యం పెరుగుతోందన్న మాట వినిపిస్తోంది.