Begin typing your search above and press return to search.

ఫర్లేదు.. ఇన్నాళ్లకు బాబు బ్యాచ్ కు తెలివి వచ్చేసిందే?

By:  Tupaki Desk   |   12 Oct 2022 4:40 AM GMT
ఫర్లేదు.. ఇన్నాళ్లకు బాబు బ్యాచ్ కు తెలివి వచ్చేసిందే?
X
మిగిలిన రంగాలు ఎలా ఉన్నా... రాజకీయ రంగంలో కొన్ని విషయాల్ని పట్టుకొని.. వారి రాజకీయ జీవితం మొత్తం ఛేజ్ చేస్తుంటారు వారి ప్రత్యర్థులు. అలాంటి వారికి సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం ఇవ్వకుండా.. సదరు నేతల జీవితం మొత్తం ఆ మరక వెంటాడుతూనే ఉంటుంది. ఆ మరక వెంటనే తుడిచేలా వాదనలు వినిపించకుండా.. లైట్ తీసుకుంటే.. తర్వాతి కాలంలో దాని తీవ్రతను గుర్తించినా పెద్దగా ఫలితం ఉండదు కదా? దాన్ని అప్పుడు ఎంత కాస్ల్టీ వాషింగ్ పౌడర్ ను వాడినా మరక పోదు.

ఇదంతా ఎందుకంటే.. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాన్ని చూస్తే.. తాను చేసిన పనికి జనామోదం లభించినా.. తన ప్రత్యర్థులు అదే పనిగా ఒక అంశాన్ని పట్టుకొని తనను అదే పనిగా వేటాడే తీరు విషయంలో ఇంతకాలం ఆయన.. ఆయన సలహా మండలి చేసిన తప్పులే కారణమని చెప్పాలి.

ప్రత్యర్థులకు అవకాశం లభించిందంటే.. వ్యూహ లోపమేనని చెప్పక తప్పదు. అదే సమయంలో ఒక సీరియస్ విషయాన్ని సరిగా డీల్ చేయకుండా.. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి తగిన మూల్యంగా చెప్పక తప్పదు. పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు అదే పనిగా విరుచుకుపడుతుంటారు. వాస్తవంలోకి వెళ్లి చూస్తే.. ఇదే ఎన్టీఆర్ కు థోకా ఇచ్చిన నాదెండ్ల భాస్కర్ రావు విషయంలో స్పందించిన ఏపీ ప్రజలకు భిన్నంగా.. నాడు చంద్రబాబు హయాంలో జరిగిన అధికార మార్పిడి సమయంలో ఏపీ ప్రజలు కిమ్మనకుండా ఉన్నారంటే.. ఆయన్ను అంగీకరించినట్లే కదా? ఆ తర్వాతి ఎన్నికల్లోనూ ఆయన్ను ప్రజలు అంగీకరించి.. ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేశారంటే.. ఆయన చేసింది కరెక్టేనని అప్పటికే ప్రజాతీర్పు ఇచ్చినట్లు కదా?

ఆ విషయాన్ని ఇంతకాలం సమర్థంగా వినిపించే విషయంలో చంద్రబాబును పక్కన పెట్టినా.. ఆయన పరివారం మొత్తం ఏం చేసింది? అన్నది ప్రశ్న. ఇప్పుడు వెన్నుపోటు వాదనలు వినిపిస్తున్న వారంతా నాటి ప్రజాతీర్పును ఏమంటారు? ఒక విషయంలో ఒకసారి ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత అదే పనిగా సాగదీయటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి? అన్నది మర్చిపోకూడదు. దివంగత మహానేత వైఎస్ హయాంలోనూ ఆయన చేసిన చెప్పులు విసిరే మరకను.. సీఎం అయ్యాక ఒకటికి పదిసార్లు చెప్పుకోవటమే కాదు.. ఆ తప్పుడు వాదనల్ని వినిపిస్తే బాగోదన్న వార్నింగ్ ఇచ్చిన వైనాన్ని మర్చిపోకూడదు.

వైఎస్ కు ఉన్న తెలివి.. ముందుచూపు.. మరకల్ని సమయానికి తగ్గట్లు తుడిపేసుకునే తీరు.. చంద్రబాబుకు కానీ ఆయనకు థింక్ ట్యాంకర్స్ గా వ్యవహరించే వారికి లేకపోవటమే అసలు సమస్యగా చెప్పాలి. వెన్నుపోటు అంటూ రచ్చ చేసే వారికి.. అసలు ఆ పరిస్థితికి కారణం ఏమిటి? అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అన్న ప్రశ్నలకు ఇంతకాలం సమాధానం ఇవ్వని చంద్రబాబు.. తాజాగా బాలయ్య షోలో పాల్గొని.. మనసు విప్పి మాట్లాడిన వైనం చూస్తే.. ఇంతకాలం చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకున్నారన్న భావన కలుగక మానదు.

ఇదే పని.. ఇరవై ఏళ్ల క్రితమే చేసి ఉంటే.. ఇవాల్టి రోజున వెన్నుపోటు వ్యక్తి అన్న మాటను పడాల్సిన అవసరం చంద్రబాబుకు ఉండేది కాదు. ఆ మాటకు వస్తే.. ఈ విషయంలో బాబునుమాత్రమే కాదు.. ఆయన థింక్ ట్యాంకర్స్ ను కూడా వేలెత్తి చూపించాల్సిందేనని చెప్పక తప్పదు.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.