Begin typing your search above and press return to search.

జగన్ వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు డ్యామేజ్: చంద్రబాబు

By:  Tupaki Desk   |   1 Jan 2022 4:30 PM GMT
జగన్ వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు డ్యామేజ్: చంద్రబాబు
X
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని, ఒక్క అవకాశమివ్వాలంటూ ఓట్లు అడిగిన జగన్ పై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చేదానికంటే ప్రజలపై మోపుతున్న భారం మూడు రెట్లుంటోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నానని, ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను జగన్ దెబ్బ తీశారని అన్నారు.

జగన్ పాలనలో పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారని, ఏసీబీ, సీఐడీలను అడ్డుపెట్టుకుని అందరినీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు ఎండగడతారని, ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితమని, దానిపై స్పందించనని అన్నారు.

ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని, వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యమని అన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి కంటే జగన్ ఏదో చేస్తారని ప్రజలు భావించి ఓటేశారని, కానీ ఇప్పుడు ఆ భ్రమలు తొలుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇకపై మరింత విస్తృతంగా పోరాటాలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. పని చేయని నేతలు, ఇన్‌చార్జ్‌లను పక్కన పెట్టేస్తామన్నారు. ఎవరి కోసమో పార్టీ త్యాగాలు చేయదని ఆయన పేర్కొన్నారు.