Begin typing your search above and press return to search.

ఏటా విధ్వంసాల సంవత్సరమే: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   31 Dec 2022 8:30 AM GMT
ఏటా విధ్వంసాల సంవత్సరమే: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X
మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా విధ్వంసాల సంవత్సరంగా కొనసాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

2022కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నామని.. ఈ తరుణంలో జగన్‌ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతీ ఏడాదీ విధ్వంసాలేనని గుర్తు చేశారు. ప్రభుత్వ విధ్వంసాల ఫలితాన్ని ప్రజలు అనుభవిస్తున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నా ప్రజలు ఎప్పుడూ ఇంతగా ఇబ్బందిపడలేదని గుర్తు చేశారు. అందుకే జగన్‌ రెడ్డిని తాను సైకో అంటున్నానని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. వైసీపీ రౌడీలు, సైకోలు ఊరికొకర ఉన్నారన్నారు. జగన్‌ బాబాయిని చంపినోడిపై ఇంతవరకు చర్యలు లేవన్నారు. కందుకూరు ఘటనలో మాత్రం తనపై కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా సహా వివిధ వ్యవస్థలపై దాడి చేయడం ద్వారా జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు.

దేశంలో ఎక్కడాలేని ధరలు ఆంధ్రప్రదేశ్‌ లోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతీరైతు తల మీద అప్పుందని చెప్పారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని చంద్రబాబు హాట్‌ కామెంట్స్‌ చేశారు. కౌలు రైతు వ్యవస్థలో ఏపీ అగ్రస్థానంలో ఉండేదన్నారు.. ఇప్పుడు కౌలు రైతులు కూడా పారిపోయారని తెలిపారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిందని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గంజాయి, డ్రగ్స్‌ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదని తెలిపారు. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు.

అలాగే రాష్ట్రంలో సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిందని తెలిపారు. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొందని వెల్లడించారు. విద్యా వ్యవస్థను జగన్‌ నాశనం చేశారని మండిపడ్డారు. ఎక్కడా లేని పన్నులు రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై 40 రకాల పన్నులు మోపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ఏడాది అంతా వైసీపీ బాదుడు, వేధింపుల సంవత్సరంగా మిగిలిపోయిందన్నారు.

నెల్లూరులో కాకాణి గోవర్థన్‌రెడ్డి 11వ తేదీన మంత్రి అయితే ఆ ముందు రోజే కోర్టులో ఫైళ్లు మాయమయ్యాయన్నారు. చివరకు జడ్జీలకు సైతం బెదిరించే స్థాయికి వైసీపీ నేతలు చేరారని చంద్రబాబు మండిపడ్డారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.