Begin typing your search above and press return to search.

అరెస్టులు దారుణం..టీచర్లకు జగన్ క్షమాపణ చెప్పాలి:చంద్రబాబు

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:11 PM GMT
అరెస్టులు దారుణం..టీచర్లకు జగన్ క్షమాపణ చెప్పాలి:చంద్రబాబు
X
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారంపై ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బదిలీలపై వెబ్ కౌన్సిలింగ్ సక్రమంగా జరగడం లేదని, దానిని రద్దు చేయాలని, ఖాళీల్లో బ్లాకింగ్ రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, బదిలీల్లో పారద్శకత కోసమే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ క్రమంలోనే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దగ్గర నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. వారితో పాటు ఏపీలో నిరసన చేపట్టిన వేలాది మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఫై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలను జగన్ అమలు చేస్తున్నారని, ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు.

వెబ్ కౌన్సిలింగ్ పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధిస్తోందని, వారి సమస్యలు పరిష్కరించకుండా కక్ష సాధింపునకు పాల్పడుతుతోందని మండిపడ్డారు. ఉపాధ్యాయుల బదిలీలలో వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఉపాధ్యాయులను జగన్ అవమానించారని చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మద్యం షాపులలో పెట్టి వారి చేత మద్యం అమ్మించారని చంద్రబాబు మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చితో పాఠశాలలు తెరిచి, వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడేలా జగన్ చేశారని దుయ్యబట్టారు. వారం రోజులలో సీపీఎస్ రద్దు, 11వ పీఆర్సీ, బకాయిలు లేకుండా సమయానికి డీఏల చెల్లింపులపై ఇచ్చిన హామీలు ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని, అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని, టీచర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.