Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఇంకా విషయం అర్ధకాలేదా ?

By:  Tupaki Desk   |   2 Oct 2021 2:30 AM GMT
చంద్రబాబుకు ఇంకా విషయం అర్ధకాలేదా ?
X
‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని..ఎదురుచూసి మోసపోకుమా’..అనే తెలుగు పాట చాలా పాపులర్. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడుకే ఇంకా అర్ధంకాలేదు. మనలో సత్తా లేకుంటే బయటనుండి ఎంతమంది ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. రింగ్ లో ఫైట్ చేసేవాళ్ళకు ఫైటింగ్ లో మెళకువలు తెలిసుండాలి, పంచ్ లు విసరటంలో నేర్పు చూపించాలి. అప్పుడే ప్రత్యర్ధి కళ్ళు బైర్లుకమ్ముతుంది. అంతేకానీ ఫైటర్ మద్దతుదారులు బయటనుండి ఎంత అరిచి గీపెట్టినా రింగ్ లో ఉన్నవాళ్ళకు బలంలేకపోతే చేయగలిగేదేమీలేదు.

ఈ విషయం చంద్రబాబుకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే తనకు వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మతో చంద్రబాబు కాంట్రాక్టును రద్దుచేసుకన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019లో జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించటంలో ప్రశాంత్ కిషోర్ (పీకే)దే కీలక పాత్రగా ఇప్పటికీ చంద్రబాబు అండ్ కో చాలా బలంగా నమ్ముతున్నారు. పీకే సలహాలు, వ్యూహాలు లేకపోతే జగన్ అధికారంలోకి వచ్చుండేవారు కాదని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు.

అందుకనే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కొద్దిరోజులకే పీకే బృందంలో పనిచేసి వేరుకుంపటి పెట్టుకున్న రాబిన్ శర్మను తన వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఇక్కడే చంద్రబాబు అండ్ కో తప్పుగా ఆలోచిస్తున్నారని చెప్పచ్చు. పీకే లేకపోయినా జగన్ మొన్నటి ఎన్నికల్లో గెలిచుండేవారే అనటంలో సందేహంలేదు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది.

పీకే బృందం చేసిన పనేమిటంటే జనాలు ఏమి కోరుకుంటున్నారు ? వాళ్ళ ప్రయారిటీలు ఏమిటి ? లాంటి అంశాలను నివేదిక రూపంలో ఎప్పటికప్పుడు జగన్ కు అందించింది. పెరిగిన జగన్ ఇమేజికి, పీకే వ్యూహాలు+చంద్రబాబు మీద వ్యతిరేకత తోడవ్వటంతో అఖండ విజయం సాధ్యమైంది. అంతేకానీ అచ్చంగా పీకే వల్లే జగన్ అధికారంలోకి రాలేదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోవటంలో చంద్రబాబు ఫెయిలవుతున్నారు. అందుకనే రాబిన్ శర్మతో కాంట్రాక్టు చేసుకుని తాజాగా రద్దుచేసుకున్నారు.

టీడీపీని రాబిన్ శర్మనే అధికారంలోకి తీసుకొచ్చేట్లయితే ఇక చంద్రబాబు ఎందుకు ? పీకే అయినా, శర్మ అయినా ఏ రాజకీయ పార్టీని అధికారంలోకి తేలేరన్నది వాస్తవం. అదే నిజమైతే వాళ్ళు రాజకీయ పార్టీలకు ఎందుకు పనిచేస్తారు ? వాళ్ళే కొత్త పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చేస్తారు కదా ? జగన్ లో దమ్ముంది కాబట్టే అధికారంలోకి రాగలిగారు. అలాగే చంద్రబాబు కూడా వ్యూహకర్తలను నమ్ముకునేకన్నా తన నేతలను, కార్యకర్తలను నమ్ముకుంటేనే మేలు. వ్యూహకర్తలు కూడా ఒకస్ధాయి వరకే పనిచేయగలరు.

పార్టీలో దమ్ములేకపోతే ఎంతమంది శర్మలున్నా ఉపయోగం ఉండదు. కాబట్టి చంద్రబాబు అర్జంటుగా చేయాల్సిందేమంటే తనకు మద్దతిచ్చే మీడియాను ముందు దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఆ మీడియా రాతలను జనాలు నమ్మటం ఎప్పుడో మానేశారు. జగన్ కు వ్యతిరేకంగా తన మద్దతు మీడియాలో రాయించుకుని సంబరపడితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ దెబ్బపడటం ఖాయం.

కాబట్టి ఇప్పటికైనా మేల్కొని చంద్రబాబు నేతలతో కాకుండా కార్యకర్తలతో సమావేశమవ్వాలి. అప్పుడే పార్టీలోని లోపాలను కార్యకర్తలు ఎత్తిచూపిస్తారు. మొహమాటాలకు పోకుండా లోపాలను సవరించుకుంటే వచ్చే ఎన్నికల్లో ఉపయోగం ఉంటుందేమో.