Begin typing your search above and press return to search.

పోయి రావలె కుప్పానికి...

By:  Tupaki Desk   |   4 Jan 2022 11:30 AM GMT
పోయి రావలె కుప్పానికి...
X
రాజకీయాల్లో ఒక్కోసారిగా సాఫీగా సాగుతుందనుకున్న చోట భారీ కుదుపులు వస్తూంటాయి. అలాంటి కుదుపే కుప్పంగా చెబుతున్నారు. మూడు దశాబ్దాల పాటు చంద్రబాబుని సమాదరించి మూడు మార్లు ముఖ్యమంత్రి చేసిన కుప్పం ప్రజలు ఇపుడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానికి తార్కాణంగా పంచాయతీ నుంచి మునిసిపాలిటీ దాకా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని చోట్లా వైసీపీ జెండా కుప్పంలో ఎగిరింది.

దాంతో విపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడుకి కుప్పం ఫీవర్ పట్టుకుంది. కుప్పంలోనే ఎదురీత మొదలైతే అది ఏపీలో టీడీపీ మీద పెను ప్రభావం చూపిస్తుంది అని ఆయన భావిస్తున్నారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికల తరువాత చంద్రబాబు ఆలోచనలు మారాయి. ఆయన ఆ మధ్య మంగళగిరి పార్టీ ఆఫీసులో సైతం కుప్పం మీద పూర్తి స్థాయి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కుప్పానికి చంద్రబాబు తరచూ రావాలని కోరినట్లుగా తెలిసింది.

అంతే కాకుండా చంద్రబాబు కొందరు నాయకుల మీద నమ్మకం ఉంచారని, వారి వల్లనే కుప్పంలో టీడీపీ పట్టు జారుతోందని కూడా ఫిర్యాదులు అందాయి. ఈ పరిణామాల క్రమంలో ఇక మీదట కచ్చితంగా రెండు మూడు నెలలకు ఒకసారి అయినా కుప్పానికి వెళ్లాలని బాబు నిర్ణయించుకున్నారు. దీంతో తాజాగా చంద్రబాబు కుప్పం టూర్ కన్ ఫర్మ్ అయింది. ఈ నెల 6,7,8 తేదీలలో బాబు కుప్పం టూర్ ఉందని అంటున్నారు.

మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో కలియదిరగనున్నారని అంటున్నారు. అదే విధంగా లోకల్ లీడర్స్ ని కూడా రీచార్జ్ చేస్తారని, పనిచేయని వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. తాను కుప్పాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయడంలేదని కూడా బాబు ప్రజలకు తన లేటెస్ట్ టూర్ ద్వారా చెప్పదలచుకుంటున్నారు.

ఇక చంద్రబాబు చివరిసారిగా కుప్పానికి వచ్చింది మునిసిపల్ ఎన్నికల ముందు మాత్రమే. అప్పట్లో ఆయన మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటన చేశారు. తెలుగుదేశానికి అండగా ఉండమని ప్రజలకు నాడు విన్నపం చేసుకున్నారు. కానీ రిజల్ట్ తేడా కొట్టింది. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు కుప్పం అభివృద్ధి మీద వైసీపీ ఇచ్చిన హామీల అమలు మీద గట్టిగా నిలదీయనున్నారుట. మొత్తానికి ఇక మీదట మరిన్ని పర్యటనలు కుప్పంలో చంద్రబాబు చేస్తారని చెబుతున్నారు.

వీలు దొరికితే చాలు కుప్పానికి వెళ్తారని అంటున్నారు. చంద్రబాబే చెప్పినట్లుగా కుప్పంలో ఒక సొంత ఇల్లు కూడా ఆయన నిర్మించుకుంటారని అంటున్నారు. ఈ పరిణామాలు చూస్తూంటే బాబు కుప్పం కోటలో టీడీపీ జెండాను ఇంకా ఎత్తున ఎగిరేలా చేసేందుకు మాస్టర్ ప్లాన్ తోనే రెడీగా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి బాబు తాజా కుప్పం టూర్ లో మరెన్ని విశేషాలు ఉంటాయో.