Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నిర్ణయంతో బాబుకు గుబులు

By:  Tupaki Desk   |   24 Jan 2019 4:30 AM GMT
కాంగ్రెస్ నిర్ణయంతో బాబుకు గుబులు
X
ఆంధ్రప్రదేశ్ లో రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసేది లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గుండెల్లో గుబులు రేపుతోంది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యమని సొంత సర్వేలు కూడా తేల్చడంతో ఈ సారి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని ఎలాగైనా విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావించారు. ఇందులో భాగంగానే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు. అయితే అది కాస్తా బెడిసి కొట్టింది.చివరకు కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమికి కారణం చంద్రబాబు నాయుడే అనే ప్రచారం కూడా జరిగింది.ఇది చంద్రబాబు నాయుడికి ఊహించని పరిణామంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం ప్రారంభమై అది కాస్తా చంద్రబాబు నాయుడితో స్నేహానికే ఎసరు పెడుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు నాయుడి వ్యూహాన్ని పార్టీలో కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. అయితే కాంగ్రెస్ కు సంప్రదాయక ఓటు బ్యాంకు ఉందని, అది తమతో కలిస్తే మేలు జరుగుతుందని చంద్రబాబు నాయుడు వారిని ఒప్పించారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా వస్తుందని నమ్మబలికారు. పార్టీలో సీనియర్ నాయకులను, సానుభూతి పరులను కాంగ్రెస్ తో పొత్తుపై అంగీకరింప చేసిన చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీయే ఝలక్ ఇచ్చింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగే పరిస్ధితులు వచ్చాయి.

ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలవనంటూ ప్రకటించారు. ఆయన వామపక్షాలతోనే కలిసి పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.దీంతో పవన్ కల్యాణ్ ను ఎలాగైనా ఒప్పించి పాత స్నేహాన్ని కొనసాగించాలనుకున్న చంద్రబాబు నాయుడికి ఆ ఆశలు కూడా అడియాశలయ్యాయి. మిగిలిన కాంగ్రెప్ పార్టీ కూడా చెయ్యి ఇవ్వడంతో ఇక రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం దాదాపు అసాధ్యమేనని తేలిపోయింది. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడి గుండెల్లో గుబులు రేపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.