Begin typing your search above and press return to search.

చంద్రబాబు ‘స్టే’టజీ మళ్లీ ఫలిస్తుందా?

By:  Tupaki Desk   |   1 Sep 2016 10:20 AM GMT
చంద్రబాబు ‘స్టే’టజీ మళ్లీ ఫలిస్తుందా?
X
తెలుగు రాష్ర్టాల్లో మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కొత్త స్టెప్ వేశారు. తనను విచారించాలని కోరడం అర్ధరహితమంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై విచారణ జరపాలంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ క్వాష్ పిటిషన్‌ వేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను కొనేందుకు డబ్బులు ఇచ్చిన వ్యవహారం అవినీతినిరోధక చట్టం పరిధిలోకి రాదని చంద్రబాబు - ఆయన పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ కోణంలోనే విచారణను ఆపించాలని చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలు తప్పుడువని.. కేసుతో తనకు సంబంధం లేదని వాదించే సందర్భాల్లో క్వాష్ పిటిషన్ వేస్తారు. చంద్రబాబు న్యాయ నిపుణులతో సంప్రదించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఒకవేళ హైకోర్టులో అనుకూలత లేకపోతే సుప్రీంను ఆశ్రయించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

కాగా తనపై దాఖలైన కేసుల్లో విచారణ జరగకుండా స్టే తెచ్చుకోవడంలో చంద్రబాబు ఆరితేరిపోయారని.. అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు అది కొనసాగించగలుగుతారో లేదో చూడాలి. ఏడాది కిందట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు కోట్లు ఇస్తూ రేవంత్ రెడ్డి ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం చంద్రబాబు ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. తొలుత కేసు విషయంలో తెగ హడావుడి చేసిన కేసీఆర్ ప్రభుత్వం అనంతరం సైలెట్ అయిపోయింది. చంద్రబాబు - కేసీఆర్ రాజీ పడ్డారన్న విమర్శలు వచ్చాయి.

కానీ, చాలాకాలంగా ఆగిపోయిన ఆ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించిన నివేదికను రెండు రోజుల కిందట ఏసీబీకి కోర్టుకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమర్పించారు. వెంటనే చంద్రబాబుపై విచారణకు ఆదేశించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 29లోగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రను తేల్చాలని ఏసీబీని ఆదేశించింది. దీంతో తిరిగి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కదలిక మొదలైంది. టీడీపీ నేతలు మాత్రం ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని వాదిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచిన సమయంలో నమోదు చేసే కేసు తరహాలోనే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు దీన్నుంచి సింపుల్ గానే బయటపడతారని చెబుతున్నారు. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.