Begin typing your search above and press return to search.

ఏపీలో ప్ర‌భుత్వ ప్రేరేపిత ఉగ్ర‌వాదం: చంద్ర‌బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   18 Jan 2023 12:41 PM GMT
ఏపీలో ప్ర‌భుత్వ ప్రేరేపిత ఉగ్ర‌వాదం:  చంద్ర‌బాబు ఫైర్‌
X
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం రాష్ట్రంలో నడుస్తోందని, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.2 వేల నోట్లు కనిపించడంలేదన్నారు. ఓట్ల కొనుగోలుకు అన్ని రూ.2 వేల నోట్లను జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌లో దాస్తున్నారని ఆరోపించారు.

పేదల రక్తాన్ని కూడా జలగలా తాగేస్తున్నారని, ఎన్టీఆర్ సిద్దాంతాలను జయప్రదం చేయాలంటే సైకో పాలన పోవాలని, సైకిల్ పాలన రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నాడు ప్రజా వేదిక కొట్టి.. నేడు ప్రజల కొంపలు కొల్ల గొడుతున్నారని.. 5 కోట్ల ప్రజలు సైకోపై పోరాడాల్సిన తరుణమిదని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పనిచేయటమే ఆయనకు నిజమైన నివాళి అని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం భువనేశ్వరి, బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు ప్ర‌శంసించారు.

రాష్ట్రంలో ఉత్తమ పాలనకు సృష్టికర్త ఎన్టీఆర్ అయితే.. ఉత్తమ విధ్వంస కారుడు జగన్మోహన్ రెడ్డని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు భావితరాల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ తపించారన్నారు.

నేడు బాధ్యత లేని విధ్వంసకారుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల భావితరాల భవిష్యత్తు కూడా గోదావరి పాలైందని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవానికి ఆత్మ విశ్వాసం జోడించి ముందుకెళ్తే, ప్రపంచాన్ని జయించే శక్తి మన సొంతమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకం పోయిన తాజా పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలన్నారు.

పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన నిర్లక్ష్యం కారణంగానే కందుకూరు, గుంటూరులలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. గుంటూరులో పంపిణీ సక్రమంగా జరగకుండా చావులు చూడాలన్న రీతిలో పోలీసులే కానుకలు విసిరేశారన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులే కొన్ని కానుకలు విసిరేసి జనం ఎగబడేలా చేసిన వీడియోలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఓటమి భయంతోనే అధికారపార్టీ పోలీసుల ద్వారా చావు కుట్రలు పన్ని జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని విమ‌ర్శ‌లు గుప్పించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.