Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కారుపై చంద్ర‌బాబు .. చండ్ర నిప్పులు.. అంశాల వారీగా ధ్వ‌జం

By:  Tupaki Desk   |   11 Oct 2021 2:24 PM GMT
ఏపీ స‌ర్కారుపై చంద్ర‌బాబు .. చండ్ర నిప్పులు.. అంశాల వారీగా ధ్వ‌జం
X
ఏపీ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.. ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. గ‌తానికి భిన్నంగా.. ఆయ‌న అంశాల వారీగా.. నిప్పులు చెరిగారు. త‌ప్పులు మీరు చేస్తూ.. మాపై నింద‌లు మోపుతారా? అంటూ.. తీవ్ర‌స్థాయిలో చెలరేగిపోయారు. అంతేకాదు.. ప్ర‌భుత్వం అవినీతి, అక్ర‌మాలు, డ్ర‌గ్ మాఫియాకు కొమ్ము కాస్తోంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా అమ‌రావ‌తిలోని పార్టీ కార్యాల‌యంలో చంద్ర‌బాబు.. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వ తాజా విధానాల‌పై న‌నిప్పులు చెరిగారు. ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం, డ్ర‌గ్స్‌, పేద‌ల‌ ఇళ్ల‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు.. త‌ద‌నంత‌రం వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లపై.. చంద్ర‌బాబు సూటిగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలంగాణ‌కు లేని స‌మ‌స్య ఇక్క‌డేనా?

కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ స‌ర్కారుకు విరుచుకుప‌డ్డారు. పొరుగు రాష్ట్రం తెలంగాణకు లేని విద్యుత్‌ సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని దుయ్య‌బ‌ట్టారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారని ఆయన తెలిపారు. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదని సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచలేదని, పవన విద్యుత్, సోలార్ విద్యుత్ తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.

మీరే ఆపించి.. మాపై నింద‌లా?

రాష్ట్రంలో పేద‌ల‌కు ఇళ్ల పంపిణీ విష‌యంలో ఇటీవ‌ల హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. చాలీచాల‌ని ఇళ్లు ఇచ్చి.. రాష్ట్రాన్ని మురికికూపంగా మారుస్తున్నారంటూ.. వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఈ ఇళ్ల నిర్మాణాల‌ను నిలుపుద‌ల చేయాల‌ని ఆదేశించింది. దీనిపై వెంట‌నే స్పందించిన వైసీపీ నాయ‌కులు ఇదంతా చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ నేత‌ల కుట్ర‌గా పేర్కొన్నారు. తాజాగా దీనిపై స్పందించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. ఇళ్ల స్థ‌లాల‌ విషయంలో వైసీపీ నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి టీడీపీపై బురద జల్లుతున్నారని అన్నారు.

2 వేల కోట్లు బొక్కేశారు!

గృహ నిర్మాణ పునాది పైన కేంద్రం రూ.3,700 కోట్లు విడుదల చేసిందని చంద్రబాబు చెప్పారు. దీనిలో రూ.2 వేల కోట్లను దారి మళ్లించారని, దారి మళ్లించిన నిధులు లబ్ధిదారులకు ఎగనామం పెట్టేందుకు వైసీపీనే కోర్టులో కేసులు వేయించి దాన్ని ప్రతిపక్షాలకు అంటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జగన్ రెడ్డి కట్టే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావని వైసీపీ శాసనసభ్యులే చెప్పారని అన్నారు. సెంటు పట్టాలో రూ.6,500 కోట్ల అవినీతి చేశారని, నగరాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల భూమి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

`ఆశి` ఎవ‌రో తెలీదా?

రాష్ట్రంలో డ్ర‌గ్స్ మాఫియాకు ప్ర‌భుత్వ‌మే వెన్నుద‌న్నుగా ఉంద‌ని .. చంద్ర‌బాబు అన్నారు. ఆశి ట్రేడింగ్ కంపెనీతో వేలకోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియాకు శ్రీకారం చుట్టారని విరుచుకుప‌డ్డారు. ఆశి అనే పేరు ఆలీషా కుమార్తె యొక్క నిక్ నేమ్ కాదా? అని ప్ర‌శ్నించారు. ఆలీషా పెద్ద మనిషి అని చంద్రశేఖర్ రెడ్డి కితాబు ఎందుకు ఇచ్చారని నిల‌దీశారు. వారి అక్రమ వ్యాపారానికి ఇది నిదర్శనం కాదా? అంటూ చంద్రబాబు.. జగన్ సర్కారుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.