Begin typing your search above and press return to search.

చంద్రబాబు దృష్టి కూడా వారి పైనే!

By:  Tupaki Desk   |   24 Dec 2022 6:00 AM GMT
చంద్రబాబు దృష్టి కూడా వారి పైనే!
X
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ను చుట్టేస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన తన ఉత్సాహాన్ని కోల్పోకుండా పర్యటిస్తుండటం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తపిస్తున్న బాబు.. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు సభలకు ప్రాంతాలకతీతంగా భారీ ఎత్తున జనం తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రపైన చంద్రబాబు దృష్టిసారించారు. ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువ. తూర్పు కాపులు, కళింగలు, కొప్పుల వెలమలు, గవరలు, దేవాంగులు, మత్స్యకారులు, పొలినాటి వెలమలు, యాదవులు భారీగా ఉన్నారు. వీరంతా ఒకప్పుడు టీడీపీకి పెట్టనికోటగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు టీడీపీకి వచ్చేవి. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం తనకు ఆయువుపట్టు లాంటి ఉత్తరాంధ్రలో టీడీపీ గట్టిదెబ్బతింది.

ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు సాధించాలని టీడీపీ కంకణం కట్టుకుంది. వైసీపీ మళ్లీ బీసీలు, ఎస్టీ, ఎస్సీలు, మైనారిటీలపైనే ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతోంది. దీంతో చంద్రబాబు సైతం తామే బీసీలను ప్రోత్సహించామని చెబుతున్నారు. ఎర్రం నాయుడు, దేవేందర్‌ గౌడ్, కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి ఇలా పలువురు బీసీ నేతలను టీడీపీ తీర్చిదిద్దిందని తెలిపారు.

జగన్‌ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని.. బీసీల కోసం ఉద్దేశించిన ఎన్నో పథకాలను రద్దు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. బీసీల కోసం టీడీపీ హయాంలోనే బీసీ కమిషన్‌ ను కూడా వేశామని గుర్తు చేశారు.

బీసీలను అన్ని రకాలుగా పైకి తీసుకురావడానికి ప్రణాళిక రచిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. చాకలి, మంగలి వంటి పేర్లతో వారిని పిలవద్దని రజకులు, నాయీ బ్రాహ్మణులు అని పిలవాలని పిలుపునిచ్చారు. తాను సైతం అలవాటుగా అన్నానని.. అందుకే తనను క్షమించాలని కోరారు.

విజయనగరం జిల్లాలో తన పర్యటన సందర్భంగా రెండో రోజు కూడా చంద్రబాబు బీసీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తూర్పు కాపులు, శ్రీశయన, దేవాంగ, గవర, రెడ్డిక, యాదవ, మత్స్యకార, గీత కార్మిక, శిష్టకరణ వంటి కులాలతో సమావేశం ఏర్పాటు చేశారు. తద్వారా బీసీ వర్గాలను టీడీపీ వైపు ఆకర్షించే ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేశారు.

మరోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ జనవరి 12న యువశక్తి పేరిట శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలో పవన్‌ అభిమానులు, ఆయన సామాజికవర్గం తూర్పు కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఓవైపు జగన్, మరోవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్‌ ఉత్తరాంధ్రపై ఫోకస్‌ చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.