Begin typing your search above and press return to search.

క్లైమోర్స్ మైన్స్ దాడికి చలించలేదు.. భార్యను అంటుంటే తట్టుకోలేకపోయారు!

By:  Tupaki Desk   |   20 Nov 2021 5:36 AM GMT
క్లైమోర్స్ మైన్స్ దాడికి చలించలేదు.. భార్యను అంటుంటే తట్టుకోలేకపోయారు!
X
సుదీర్ఘ రాజకీయ అనుభవం.. దాదాపు పద్నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని నిర్వహిస్తూ.. పన్నెండున్నరేళ్లు విపక్ష నేతగా ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు పొలిటికల్ కెరీర్ చూస్తే.. ఎత్తుపల్లాలకు కొదవ లేదనే చెప్పాలి. ఆయన తన రాజకీయ ప్రయాణంలో విజయాలే కాదు.. బోలెడన్ని అపజయాల్ని ఎదుర్కొన్నారు. కాలం పెట్టిన పరీక్షలకు తట్టుకొని నిలబడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడిన ఆయన.. తన జీవిత భాగస్వామి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేయటంతోనే ఆయన తట్టుకోలేకపోయారు పూర్తిస్థాయి ఎమోషనల్ అయ్యారు.

దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. వర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతల్నిచేపట్టటం.. చిన్న వయసులోనే ముఖ్యమంత్రికావటం జరిగింది. రాష్ట్ర.. కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన చంద్రబాబు తన రాజకీయ జీవితంలో బోలెడన్ని ఎదురుదెబ్బలు తిన్నాడు. 1983లో చంద్రగిరిలో ఓటమి పాలుకావటం ఆయన రాజకీయంగా ఎదుర్కొన్న అతి పెద్ద ఎదురుదెబ్బ. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఆయన ఎదుర్కొన్నారు.

1989లో టీడీపీ అధికారాన్ని కోల్పోయినప్పుడు కూడా ఆయన డీలా పడలేదు. పార్టీని అధికారంలోకి తెచ్చే వరకూ శ్రమించి.. తాను అనుకున్నది సాధించటంలో కీలకభూమిక పోషించారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్ర రూపురేఖల్ని మార్చేశారు. అనంతరం 2004.. 2009లో జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన సందర్భంలోనూ డీలా పడలేదు. అంతేకాదు.. ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న వేళలో ఆయనపై మావోలు క్లైమోర్లను పేల్చి.. హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ సమయంలో గాయపడిన ఆయన బెదర్లేదు.. రగిలిపోలేదు. చావు దగ్గరకు వచ్చినా చలించని చంద్రబాబు.. ఇప్పుడు అందుకు భిన్నంగా కన్నీళ్లు పెట్టేసుకున్నారు.

పోరాటమే ఆయుధంగా మలుచుకొని తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారు. అరుపదుల వయసులో మహా పాదయాత్రను చేపట్టిన ఆయన.. చివరకు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.తన పొలిటికల్ కెరీర్ లో ఎందరో ముఖ్యమంత్రుల్ని చూశారు. చెన్నారెడ్డి.. కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. నేదురమల్లి జనార్దన్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వారిని ఎదుర్కొన్న ఆయన.. ఎవరెంతలా రెచ్చగొట్టిగా.. ఘాటుగా రియాక్టు అయినా ఆయన చలించలేదు.

వయసు ప్రభావం కానీ.. ఇప్పటివరకు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనను విమర్శించే వారు.. వేలెత్తి చూపే వారు ఉన్నారే కానీ.. తన జీవిత భాగస్వామి గురించి దారుణ వ్యాఖ్యలు చేయటంతో ఆయన తట్టుకోలేకపోయారు. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక బరస్ట్ అయ్యారు. మావోలు పేల్చిన క్లైమోర్ దాడిని సైతం తట్టుకొని నిలిచిన చంద్రబాబు.. ఏపీ అధికార వైసీపీ నేతల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని మాత్రం తట్టుకోలేకపోయారని చెప్పాలి.