Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు కర్ణాటకలోనూ అవమానం

By:  Tupaki Desk   |   25 May 2019 7:33 AM GMT
చంద్రబాబుకు కర్ణాటకలోనూ అవమానం
X
ఆంధ్రప్రదేశ్‌ లో చావు దెబ్బ తిన్న చంద్రబాబునాయుడుకు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా పరాభవమే ఎదురైంది. ఆయన ప్రచారం చేసిన మండ్య, మైసూరులో భిన్న ఫలితాలు వచ్చాయి. అంతేకాకుండా కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఘోరంగా ఓడిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో చంద్రబాబు పలు రాష్ట్రాల్లో పర్యటించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అడుగుపెట్టిన ప్రతి చోటా బీజేపీకి ప్లస్‌ అయిందని చెప్పవచ్చు. కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ హవా సాగింది. ఫలితంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నుంచి అతిరథ మహారథులు ఓటమి రుచి చూశారు. కలబుర్గి నుంచి మల్లికార్జునఖర్గే, కోలార్‌ నుంచి కేహెచ్‌ మునియప్ప, చిక్కబళ్లాపుర నుంచి వీరప్ప మొయిలీ, తుమకూరు నుంచి హెచ్‌డీ దేవెగౌడ ఓడిపోయారు.

జాతీయ నేతల ఓటమి

– బీజేపీ సాగించిన ఏకపక్ష హవాలో కర్నాటకలో పలువురు జాతీయ రాజకీయ నేతలు సైతం కొట్టుకుపోయారు. లోక్‌ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జునఖర్గే ఈసారి ఓటమి చవిచూశారు. ఆయన గత 11 పర్యాయాలుగా ఎన్నికల బరిలో దిగారు. అసెంబ్లీకి తొమ్మిదిసార్లు, పార్లమెంటుకు రెండుసార్లు ఎన్నికయ్యారు. అయితే ఈసారి తన శిష్యుడు ఉమేశ్‌ జాదవ్‌ చేతిలో తొలిసారిగా ఓటమి రుచి చూశారు.

– కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ సీఎం, కేంద్ర మాజీమంత్రి ఎం.వీరప్ప మొయిలీకి తాజా ఎన్నికల్లో చుక్కెదురైంది. చిక్కబళ్లాపుర నుంచి గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన వీరప్ప మొయిలీ ఈసారి ఓడిపోయారు. చిక్కబళ్లాపుర నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వీరప్ప మొయిలీ బీజేపీ నేత బీఎన్‌ బచ్చేగౌడ చేతిలో ఓడిపోయారు.

– జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ.. 87 ఏళ్ల వయసులో కూడా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నించారు. ఈమేరకు తుమకూరు నుంచి పోటీ చేశారు. అయితే బసవరాజు చేతిలో ఓడిపోయారు.

– మాజీ ప్రధాని దేవెగౌడ తనతో పాటు మనువళ్లు ఇద్దరినీ లోక్‌ సభ బరిలో దింపారు. ఈమేరకు మండ్య నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, హాసన్‌ నుంచి మంత్రి రేవణ్ణ తనయుడు ప్రజ్వల్‌ పోటీ చేశారు. అయితే కేవలం హాసన్‌లో మాత్రమే ప్రజ్వల్‌ రేవణ్ణ విజయం సాధించారు.

– బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఘోరంగా ఓడిపోయారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఈమేరకు బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే కాంగ్రెస్‌ – బీజేపీ మధ్య సాగిన ప్రధాన పోటీలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ మూడోస్థానంలో సరిపెట్టుకున్నారు.

– యావత్‌ భారత్‌ ను ఆకర్షించిన మండ్య పార్లమెంటు నుంచి స్వతంత్య్ర అభ్యర్థి నటి సుమలత అంబరీశ్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి తరఫున పోటీ చేసిన సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ ఓడిపోయారు. మండ్య పార్లమెంటు పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో జేడీఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. అదేవిధంగా ముగ్గురు రాష్ట్రమంత్రులు ఉన్నప్పటికీ జేడీఎస్‌ కు ఓటమి తప్పలేదు. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన నటి సుమలత విజయం సాధించారు.