Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు మరో షాక్..

By:  Tupaki Desk   |   27 Jun 2019 5:44 AM GMT
చంద్రబాబుకు మరో షాక్..
X
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. ఈ సామెత నిజం చేయాలని చంద్రబాబు గడిచిన 25 ఏళ్లుగా తపన పడుతున్నారు. కానీ సొంత జిల్లా చిత్తూరు ప్రజలు మాత్రం బాబుకు షాకిస్తూనే ఉన్నారు. పోయిన సారి కొంత వరకు పరువు కాపాడిన చిత్తూరు జిల్లా ఈసారి మాత్రం చంద్రబాబుకు షాకిచ్చింది.

చంద్రబాబు సొంత జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా.. టీడీపీ గెలిచింది ఒక్కటే.. అదీ చంద్రబాబుదే.. కుప్పంలో మాత్రమే టీడీపీ గెలవగా.. మొత్తం 13 సీట్లు వైసీపీ పరమైంది. ఇలా సొంత జిల్లాలోనే బాబుకు గట్టి షాకిచ్చారు జగన్.

అయితే గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన నేతలంతా ఇప్పుడు టీడీపీకి షాకిచ్చేందుకు రెడీ కావడం చంద్రబాబును ఆందోళన కు గురిచేస్తోంది. ఓడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీవైపు చూస్తున్నారని.. కింది స్థాయి కేడర్ అంతా వైసీపీలోకి క్యూ కట్టేందుకు రెడీ కావడం టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సొంత జిల్లాలో వలసలను అడ్డుకోవడానికి చంద్రబాబు ఏం చేస్తాడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజాగా జరిగిన చిత్తూరు జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశానికి చాలా మంది ముఖ్యనేతలు, తాజా ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకాకపోవడంతో టీడీపీ శిబిరం ఖంగుతింది. చిత్తూరు ఎంపీగా టీడీపీ తరుఫున పోటీచేసిన శివప్రసాద్, తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేసిన పనబాక లక్ష్మీ, రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసిన డీకే సత్యప్రభతోపాటు ఎమ్మెల్యేలుగా పోటీచేసిన శంకర్ యాదవ్, లలిత కుమారి, గాలి భానుప్రకాష్, బొజ్జల సుధీర్ రెడ్డి, హరికృష్ణ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ సర్వసభ్య సమావేశానికి దూరంగా ఉన్నారు.

దీంతో వీళ్లలో ఎంతమంది బీజేపీలోకి జంప్ చేయబోతున్నారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరులో చిత్తూరు జిల్లాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించబోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్న సమాచారం ఉంది. ఈ పరిణామం టీడీపీని, చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు వారిని బాబు ఎలా కాపాడుకుంటారన్న ప్రశ్న పార్టీ శ్రేణులను వెంటాడుతోంది.