Begin typing your search above and press return to search.

చంద్రబాబు రాంగ్ ట్రాకులో వెళుతున్నారా ?

By:  Tupaki Desk   |   30 Oct 2021 1:30 AM GMT
చంద్రబాబు రాంగ్ ట్రాకులో వెళుతున్నారా ?
X
అవునని కచ్చితంగా సమాధానం చెప్పవచ్చు. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలన్న నానుడిని చంద్రబాబునాయుడు మరచిపోయినట్లున్నారు. ఇక్కడ చక్కదిద్దుకోవాల్సిన ఇల్లంటే టీడీపీ. తర్వాత రచ్చ గెలవాలంటే ఎన్నికలన్నమాట. గడచిన ఏడున్నరేళ్ళుగా పార్టీకి సరైన దిశా నిర్దేశం లేదన్న విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే పార్టీ వ్యవహారాలను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేసేశారు. దాంతో పార్టీ వ్యవహారాలు గాడితప్పాయి.

అధికారంలో ఉన్న ఐదేళ్ళు పాలనమీద దృష్టిపెట్టిన తాను పార్టీని పట్టించుకోలేదన్న విషయాన్ని స్వయంగా చంద్రబాబే అంగీకరించారు. గడచిన రెండున్నరేళ్ళుగా కూడా దాదాపు అదే పరిస్ధితిలో ఉంది పార్టీ. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్చార్జీలు లేరు. అయినా నియమించలేకపోతున్నారంటే ఏమిటర్ధం. 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో ఐదుమంది పార్టీకి దూరమైపోయారు. మిగిలిన 18 మందిలో కనీసం పదిమంది ఎంఎల్ఏలు పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పార్టిసిపేట్ చేయటంలేదు.

మరి వాళ్ళ విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు పట్టించుకుంటారు ? పార్టీకి దూరమైపోయిన ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో ఇన్చార్జీలను నియమించాలి. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీకోసం పనిచేయని సీనియర్లను పక్కనపెట్టేసి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత చంద్రబాబుదే కదా. ఉదాహరణగా తీసుకుంటే కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని తమ్ముళ్ళ మధ్య గొడవలు రోడ్డున పడ్డాయి. పై జిల్లాలపై చంద్రబాబు ఎప్పుడు దృష్టిపెట్టి సర్దుబాటు చేస్తారో తెలీటంలేదు.

చంద్రబాబు చేస్తున్న తప్పు ఏమిటంటే పార్టీకి భారంగా తయారైన యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్లకే ఇంకా పెద్దపీట వేస్తుండటం. యనమల సోదరులను గడచిన నాలుగు ఎన్నికల్లో జనాలు వరసగా తిరస్కరిస్తున్నా రామకృష్ణుడే జిల్లాలో పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఆధిపత్యం కొత్తవాళ్ళ చేతిలో పెడితే వాళ్ళన్నా ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే వైజాగ్, విజయనగరం, చిత్తూరు, పశ్చిమగోదావరి, గుంటూరు లాంటి జిల్లాల్లో నాయకత్వం కొత్తతరం చేతిలో పెడితే నాయకత్వం ఎదిగే అవకాశం ఉంది.

ముందు పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించటం ద్వారా నేతల్లో ఉత్సాహం నింపటం మానేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని అర్జంటుగా అధికారంలో నుండి దింపేసి తాను సీఎం అయిపోదామనే అత్యాస తప్ప మరోటి కనబడటంలేదు. 2019 ఘోరంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2024 ఎన్నికల వరకు కూడా చంద్రబాబు ఆగలేకపోతుండటమే విచిత్రంగా ఉంది. జగన్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ కు చెబుతున్న కారణాల్లో ఎంతవరకు నిజముందనే విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. కాబట్టి నేల విడిచి సాము చేయటం మానేసి ముందు పార్టీని బలోపేతం చేసుకుని తర్వాత జనాధరణపై దృష్టిపెడితే బాగుంటుంది.