Begin typing your search above and press return to search.

హెలికాప్టర్ గుర్తు బాబు పన్నాగమే?

By:  Tupaki Desk   |   13 March 2019 9:44 AM GMT
హెలికాప్టర్ గుర్తు బాబు పన్నాగమే?
X
ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా, ఎంతటి సంక్షోభాన్ని అయినా తానే పరిష్కరించగలనని, ఇదివరకు వచ్చిన ఎన్నో సమస్యలను తానే పరిష్కరించానని, తనకు ప్రపంచంలోని పలు దేశాధినేతలతో పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్నాయని డప్పు కొట్టుకునే కె.ఎ. పాల్, ప్రజాశాంతి పేరిట ఓ పార్టీ పెట్టడం, ఈ సారి ఎన్నికల్లో తానూ అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తానంటూ ఆయన చేస్తున్న హంగామా వెనుక తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని సమాచారం.

చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే పాల్ తన స్థాయికి మించి టీవీ చానళ్లలో హల్ చల్ చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కె ఎ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ హెలికాఫ్టర్ గుర్తు కేటాయించింది. అయితే, వైఎస్ జగన్ నాయకత్వంలోని వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సీలింగ్ ఫ్యాన్ ను పోలినట్టుగా హెలికాప్టర్ ఫ్యాన్ కూడా ఉండేలా గుర్తును డిజైన్ చేయించడంలో చంద్రబాబు ప్రమేయం ఉందని చెబుతున్నారు. వైెస్సార్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ను పోలినట్టుగానే ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్ ఫ్యాన్ కూడా ఉండేలా డిజైన్ చేయించడంలో, ఆ గుర్తును పాల్ చేత ఎంపిక చేయించడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది. ఎన్నికల గుర్తుపై ఓటర్లను అయోమయంలో పడేసి, ఆమేరకు ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి కొట్టాలనేదే చంద్రబాబు లక్ష్యంగా చెబుతున్నారు.

ఇందుకోసం కె.ఎ. పాల్ తో చంద్రబాబు ఒక అవగాహన కూడా కుదుర్చున్నారని భోగట్టా. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కారు గుర్తుతో .ట్రక్కు గుర్తు పోలికల ఓటర్లలో అయోమయం కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి పలు చోట్ల సీట్లు, ఓట్లు నష్టపోయిన సంగతి తెలుసుకున్న చంద్రబాబు, ఏపీలో అదే ట్రిక్కు ప్రయోగించి, జనాన్ని తికమకపెట్టి తాము లాభపడాలని స్కెచ్ వేశారని చెబుతున్నారు. కాగా, తమ ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ను, హెలికాప్టర్ ఫ్యాన్ తో పోల్చుకుని ఓటర్లు అయోమయంలో పడే అవకాశం ఉందని ఉందని వైసీపీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఆ గుర్తును రద్దు చేయవలసిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ కోరగా, ప్రజాశాంతి ప్రజాశాంతి పార్టీ అసలు అధ్యక్షుడు పాల్ కంటే ముందు చంద్రబాబే స్పందించడం చంద్రబాబు, పాల్ మధ్య అవగాహన నిజమేనని తెలియజేస్తోంది. హెలికాప్టర్ గుర్తు చూసి కూడా జగన్ భయపడుతున్నారంటూ చంద్రబాబు తన టెలికాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించడం బాబు, పాల్ ల మధ్య కుదిరిన ఒప్పందాన్నిమరింత బట్టబయలు చేసింది.