Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు ఆ విష‌యంలో గుడివాడ నుంచి స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

By:  Tupaki Desk   |   15 Sep 2022 7:54 AM GMT
చంద్ర‌బాబుకు ఆ విష‌యంలో గుడివాడ నుంచి స్ట్రాంగ్ కౌంట‌ర్‌!
X
మూడు రాజ‌ధానుల‌ను కోరుతూ మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లి వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి రిఫ‌రెండ‌మ్ కోరాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన డిమాండ్‌పై ప‌రిశ్ర‌మ‌ల శాఖ గుడివాడ అమ‌ర్‌నాథ్ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు త‌మ‌కు ఐదేళ్లు ప‌రిపాలించ‌డానికి అవ‌కాశ‌మిచ్చార‌ని.. చంద్ర‌బాబు డిమాండ్ మేర‌కు మ‌ధ్య‌లోనే ఎన్నిక‌లు పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడు రాజ‌ధానులు, పాల‌నా, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణలు, సంక్షేమ ప‌థ‌కాలు ఖ‌చ్చితంగా రిఫ‌రెండం అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు మంగ‌మ్మ శ‌ప‌థాల‌కు తాము స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

చంద్ర‌బాబు కోరుతున్న‌ట్టు అసెంబ్లీని రద్దు చేసి ప్ర‌జ‌ల నుంచి మూడు రాజ‌ధానుల నుంచి రిఫ‌రెండం కోరాల్సిన అవ‌సరం తమకు లేదని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఐదేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయని, అలాంటప్పుడు తాము ఎందుకు అసెంబ్లీ రద్దు చేయాలంటూ నిలదీశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర‌ ప్రజలు స్వాగతించారని చెప్పారు. కేవలం చంద్రబాబు అండ్ కో తమ స్వార్ధ రాజకీయాల కోసమే రాజధాని వ్యవహారాన్ని వివాదాస్ప‌దం చేస్తున్నార‌ని గుడివాడ నిప్పులు చెరిగారు.

శాసనసభ సమావేశాల‌కు రానంటూ చంద్రబాబు మంగమ్మ శపథాలు చేస్తారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వస్తారని గుడివాడ అమ‌ర్‌నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట ఎమ్మెల్యేలు వినడంలేదో లేక వాళ్ళ మాట చంద్రబాబు విన‌డం లేదో తెలియడం లేద‌ని విరుచుకుప‌డ్డారు. ఎవ‌రైనా గెల‌వ‌డానికి ఆరాట‌ప‌డ‌తార‌ని.. కానీ చంద్ర‌బాబుకు ఓడిపోవ‌డానికి బాగా ఉబ‌లాటంగా ఉంద‌న్నారు. అందుకే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదామని డిమాండ్ చేస్తున్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీ తిరిగి అధికారంలోకి వ‌చ్చే సంగ‌తి త‌ర్వాత ముందు కుప్పంలో చంద్ర‌బాబు గెలిస్తే అది ప‌దివేల‌ని గుడివాడ అమ‌ర్నాథ్ వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో తాము గెలిచే మొద‌టి స్థానం కుప్పమేన‌ని తెలిపారు.

కాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ద‌మ్ము ఉంటే అసెంబ్లీని ర‌ద్దు చేసి మూడు రాజ‌ధానుల‌ను రిఫ‌రెండం కోరుతూ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేసింది. మూడు రాజ‌ధానుల‌పై తాము ముందుకే వెళ్తామ‌ని.. అయితే అసెంబ్లీని ర‌ద్దు చేయ‌బోమ‌ని, ప్ర‌జాప్ర‌తినిధులు రాజీనామాలు చేయ‌బోర‌ని వైఎస్సార్సీపీ నేత‌లు తేల్చిచెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.