Begin typing your search above and press return to search.

టీడీపీలో చంద్ర‌బాబును టెన్ష‌న్ పెడుతోన్న కొత్త డిమాండ్‌...!

By:  Tupaki Desk   |   21 Nov 2022 8:32 AM GMT
టీడీపీలో చంద్ర‌బాబును టెన్ష‌న్ పెడుతోన్న కొత్త డిమాండ్‌...!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మ‌రో ఒత్తిడి పెరిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్లు ఇప్పుడు ప్ర‌క‌టించాల‌ని టీడీపీ సీనియ‌ర్లు చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచేశారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందైనా టికెట్ల వ్య‌వ‌హారం తేల్చేయాల‌ని సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు చంద్ర‌బాబును డిమాండ్ చేసినంత ప‌నిచేశారు. అంతేకాదు..ప‌నిచేయ‌క‌పోతే, త‌న‌కు కూడా టికెట్ వ‌ద్దంటూ.. బాబు మ‌న‌సులో మాట‌ను తెలుసుకునే వ్యూహంతోముందుకు సాగారు.

తాజాగా జ‌రిగిన టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆద్యంతం చంద్ర‌బాబు నుంచి నేత‌ల వ‌ర‌కు కూడా సీరియ‌స్‌గానే కొన్ని విష‌యాల‌పై చ‌ర్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలో య‌న‌మ‌ల స‌హా అయ్య‌న్న వ‌ర‌కు కూడా టికెట్ల అంశాన్ని ప్ర‌స్తావించారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌వారు మాత్రం సైలెంట్‌గా ఉంటే.. ఓడిపోయిన నాయ‌కులు మాత్రం టికెట్ల‌పై డిమాండ్ తెర‌మీదికి తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

దీంతో చంద్ర‌బాబుకు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే, నాయ‌కుల అస‌లు విష‌యా న్ని కూడా చెప్పారు. ''మీరు ఏమైనా అనుకోండి. మీడియా లేదుకాబ‌ట్టి.. ఇక్క‌డే చెబుతున్నా.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి మీరు టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయ‌డానికి టైం తీసుకుంటే మ‌నోళ్లు దారులు వెతుక్కునే ప‌నిలో ఉన్నారు. మీరు న‌న్ను ఏమ‌న్నా ఫ‌ర్వాలేదు. వాస్త‌వం ఇదే'' అని అయ్య‌న్న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఇక‌, మ‌రో ఇద్ద‌రు నేత‌లు అవున‌నే అన్నారు. ఇప్ప‌టికీ చాలా మంది నాయ‌కులు చంద్ర‌బాబు ఎంత చెబుతున్నా.. యాక్టివ్ కాలేక‌పోతున్నారు. అంతేకాదు, కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉన్నారు. దీనికి కార‌ణం త‌మ‌కు టికెట్ వ‌స్తుందోరాదో అనే బెంగ వ‌ల్లే.. అని చెప్పారు.

పైగా వారు ఏమాత్రం అవ‌కాశం చిక్కినా.. జ‌న‌సేన లోకో.. మ‌రో పార్టీలోకో జంప్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటివారిని కాపాడుకునేందుకు ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది నేత‌ల మాట‌. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.