Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఇప్పుడు ‘అత్తారింటి’ అవసరం ఏర్పడిందా?

By:  Tupaki Desk   |   18 Nov 2021 4:30 PM GMT
చంద్రబాబుకు ఇప్పుడు ‘అత్తారింటి’ అవసరం ఏర్పడిందా?
X
కంచుకోట లాంటి కుప్పం కోట కళ్ల ముందే కూలిపోతున్న వైనాన్ని నిస్సహాయుడిగా చూస్తుండిపోవటం తప్పించి మరింకేమీ చేయలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. దశాబ్దాల కిందట తాను నిర్మించిన కోటకు బీటలు వారకుండా చాలానే జాగ్రత్తలు తీసుకున్నా.. కాలం తీసుకొచ్చిన మార్పులు.. అందుకు తగ్గట్లు రాజకీయాల్ని చేసే మైండ్ సెట్ మిస్ అయిన బాబు బ్యాచ్ వైఫల్యం కుప్పం కోట బీటలు వాడటానికి కారణంగా చెప్పక తప్పదు. తాజాగా కుప్పంలో ఎదురైన దారుణ ఓటమి నేపథ్యంలో.. చంద్రబాబు ఫ్యూచర్ ఏమిటన్న ప్రశ్న మొదలైంది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు పేరు పక్కన కుప్పం మినహా మరో పేరు ఉండేది కాదు. రెండుచోట్ల పోటీ చేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేయక తప్పనిపరిస్థితి ఏర్పడుతుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

కుప్పంకోటను బద్ధలు కొట్టాలన్న ఏపీ అధికారపక్ష అధినేత కల నెరవేరటం దాదాపుగా అయ్యిందనే చెప్పాలి. తానే స్వయంగా రంగంలోకి దిగి.. ప్రచారం చేసి.. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా మానిటర్ చేసిన తర్వాత కూడా తాజా ఎన్నికల్లో ఓటమి తప్పలేదంటే.. లోపం ఎంతన్న విషయం బాబుకు ఈపాటికి అర్థమై ఉంటుంది.

ఇలాంటివేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబుకు సేఫ్ గా ఉండే నియోజకవర్గం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తన సొంత స్థానమైన కుప్పంతో పాటు.. అత్తారింటి జిల్లా అయిన క్రిష్ణా జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనీ సారి ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయక తప్పదన్న మాట బలంగా వినిపిస్తోంది. గతంలో మాదిరి కుప్పం విషయంలో భరోసా పెట్టుకోలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. గతంలో మాదిరి ఆయన బలం ఇప్పుడు తగ్గటమే కాదు.. ఆయన తరఫున బలంగా పని చేసే వారి సంఖ్య తక్కువైందని చెప్పాలి.

దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుప్పం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టటంతో..ఈసారి ఆయన క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అందని సంక్షేమ ఫలాలు.. జగన్ హయాంలో దరి చేరటం.. ఇంతకాలం తాము నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావన కూడా తాజా విజయాలకు కారణంగా చెప్పాలి. వాస్తవానికి 2019లో జరిగిన ఎన్నికల్లోనే చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లుగా చెబుతారు.

అప్పుడే అలాంటి పరిస్థితి ఉంటే.. ఇప్పుడు స్థానిక సంస్థలన్నింటిలోనూ వైసీపీ హవా నడుస్తున్న వేళ.. ఆయన పోటీకి దిగటం ఎంతమేర సేఫ్ అన్నది ఇప్పుడు ప్రశ్న. అలా అని.. కుప్పం వదిలేస్తే.. బాబు భయపడ్డారన్న మాట పడాల్సి ఉంటుంది. అందుకే.. సేఫ్ గేమ్ లో భాగంగా కుప్పంలో పోటీ చేస్తూనే.. క్రిష్ణా జిల్లాలోని ఏదైనా సురక్షిత నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో.. సురక్షిత నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవటంతో పాటు..అక్కడ పాతుకుపోవటానికి వీలుగా కొన్ని కార్యక్రమాల్ని చేపట్టాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్రిష్ణా జిల్లాలోని అవనిగడ్డ.. పెనమలూరులో ఏదైనా ఒక నియోజకవర్గం ఆయనకు సురక్షితమన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలు వైసీపీ చేతిలోఉన్నాయి. అయితే.. స్థానిక ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత బాబుకు కలిసి వస్తుందంటున్నారు. మరి.. బాబు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.