Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా పాపం చంద్రబాబుదేనా...?

By:  Tupaki Desk   |   5 Oct 2021 1:30 PM GMT
ప్రత్యేక హోదా పాపం చంద్రబాబుదేనా...?
X
ఏపీకి ప్రత్యేక హోదా ఒక సెంటిమెంట్ అన్నది తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. నాడు బాబుని ఎలా ఆశపడి ఎన్నుకున్నారో ఆ తరువాత జగన్ కి బంపర్ మెజారిటీ ఇవ్వడానికి కూడా హోదా అంశమే కారణం. అయితే బాబు అయినా జగన్ అయినా బీజేపీ పెద్దలను ఒప్పించి హోదా తీసుకురావడంతో విఫలమయ్యారు అని మిగిలిన పక్షాలు అంటాయి. ఇక జగన్ అయితే కేంద్రంలో బీజేపీకి మెజారిటీ ఉంది. తమ అవసరం కూడా వారికి లేనందువల్ల హోదా అంశంలో వత్తిడి తేలేకపోతున్నామని చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ప్రత్యేక హోదా అన్నది మాత్రం 2024 ఎన్నికలలో మరో మారు రాజకీయ అస్త్రం అయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయి. మరి ఈసారి హోదా అంశంతో ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు అన్న చర్చ ఒక వైపు సాగుతూనే ఉంది. అయితే ఈసారి ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని వైసీపీని పూర్తిగా కార్నర్ చేయాలని చంద్రబాబు భారీ స్కెచ్ వేస్తున్నారు.

మరి బాబు ఆలోచనలకు తగినట్లుగా తెలుగు తమ్ముళ్ళు కూడా ఈ మధ్య హోదా మీద మాటల జోరు పెంచారు. తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు హోదా విషయంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడే గట్టిగా పోరాడింది. ఇపుడు వైసీపీ ఎంపీలు అసలు ఈ ఊసు తలవడం లేదు అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. అంతే కాదు టీడీపీ చిత్తశుద్ధిని ఈ విషయంలో ఎవరూ తప్పు పట్టలేరు అని కూడా అన్నారు. హోదా విషయంలో వైసీపీ రాజీ పడిందని, ఏపీని తీరని అన్యాయం చేస్తోందని కూడా తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద అతి పెద్ద బాంబు వేశారు.

ఏపీలొ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అని మీడియా అడిగితే చంద్రబాబు వద్దు అన్నారు కాబట్టే ఇవ్వలేదు అంటూ సోము వీర్రాజు బదులివ్వడం సంచలనమే అని చెప్పాలి. చంద్రబాబు హోదా వద్దు అన్నారని చెప్పి ఒక విధంగా సోము వీర్రాజు టీడీపీని ఇరకాటంలో పెట్టారు. వైసీపీ వల్లనే హోదా ఆగింది అంటూ జనాల్లోకి వెళ్తున్న టీడీపీకి ఇది సోము వీర్రాజు విసిరిన శరాఘాతంగానే భావించాలి. అదే సమయంలో వైసీపీకి అంది వచ్చిన అస్త్రంగానూ చూడాలి. ఈ అంశాన్ని వాడుకుని వైసీపీ చెలరేగిపోతే మరో మారు హోదా విషయంలో పాపాల భైరవుడిగా చంద్రబాబు జనాల్లో మిగిలిపోతారు అన్నది వాస్తవం. మొత్తానికి చూస్తే సోము వీర్రాజు చంద్రబాబుని టార్గెట్ చేయడం మాత్రం ఎక్కడా ఆపడంలేదు, ఎక్కడా తగ్గడంలేదు కూడా. ఈ విషయంలో మిత్రుడు పవన్ ఆలోచనలు ఎలా ఉన్నా కూడా సోము వీర్రాజు మాత్రం బాబు మీద బాణాలు వేస్తూనే ఉన్నారు. చూడాలి మరి దీని మీద టీడీపీ తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో.