Begin typing your search above and press return to search.

ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కు చంద్ర‌బాబు లేఖ‌.. ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   8 Jun 2021 2:30 PM GMT
ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కు చంద్ర‌బాబు లేఖ‌.. ఏమ‌న్నారంటే
X
ఏపీ పోలీసుల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు ఫైర‌య్యారు. పోలీసుల్లోని ఓ వ‌ర్గం ప‌నితీరుతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ.. గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు ఆయ‌న లేఖ రాశారు. ఈ లేఖ‌లో.. చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు పోలీసు ఉన్న‌తాధికారులు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇలాంటి వారు.. జిల్లా అధికారులైన ఎస్పీల‌పై కూడా ఒత్తిడి తెస్తున్నార‌ని.. దీంతో పోలీసుల ప‌నితీరు వివాదంగా మారింద‌న్నారు.

విశాఖ‌లో వైద్య రంగంలో ప‌నిచేస్తున్న ఓ మ‌హిళా ఉద్యోగిని న‌డిరోడ్డుపై చేతులు వెన‌క్కి విరిచి పోలీస్ స్టేష న్‌కు త‌రలించ‌డం.. వంటి ఘ‌ట‌న‌లు రాష్ట్ర ప‌రువును తీస్తున్నాయ‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పోలీసు వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్దాల‌ని.. లేక‌పోతే.. రాష్ట్రం ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతుంద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, టీడీపీ నేత‌ల‌పై అర్ధ‌రాత్రి కేసులు న‌మోదు చేయ‌డం.. దారుణ‌మ‌ని చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు.

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమ‌లు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ముఖ్యంగా కొవిడ్ స‌మ‌యంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌పై కూడా పోలీసులు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని తెలిపారు. క్లిష్ట స‌మ‌యంలో ప‌నిచేస్తున్న వారిపై చిన్న‌చూపు త‌గ‌ద‌ని అన్నారు. ప్రాథ‌మిక హ‌క్కులు కాపాడాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల్సిన పోలీసులు వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌ను వేధించ‌డం ఆపేలా గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు.