Begin typing your search above and press return to search.

పాదయాత్ర సీజన్ : చంద్రబాబు....లోకేష్... పవన్ రెడీనా...?

By:  Tupaki Desk   |   24 Aug 2022 4:30 PM GMT
పాదయాత్ర సీజన్  : చంద్రబాబు....లోకేష్... పవన్ రెడీనా...?
X
పాదయాత్ర అంటే అధికారానికి దగ్గరదారిగా అంతా భావిస్తూ ఉంటారు. గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు ప్రముఖ స్థానమే సంపాదించుకున్నారు. 2003లో వైఎస్సార్ పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2009లో చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టారు కానీ పెద్దగా క్లిక్ కాలేదు. దాంతో 2013లో ఆయన కూడా పాదయాత్ర చేపట్టారు. మరో వైపు వైసీపీ తరఫున షర్మిల ఏపీలో పాదయాత్ర చేశారు.

ఇలా ఇద్దరు నాయకులూ పాదయాత్ర చేస్తే వైసీపీకి విపక్ష హోదా దక్కింది. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. 2017లో విపక్ష నేతగా ఉన్న జగన్ భారీ పాదయాత్రకు సిద్ధపడ్డారు. ఆయన ఏకంగా మూడు వేల ఏడు వందల పై చిలుకు కిలోమీటర్లలో పాదయాత్ర చేశారు. ఆ కష్టం ఊరకే పోలేదు. 151 సీట్లతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి 2024 ఎన్నికలు వస్తున్నాయి. నిజానికి ఈ పాటికే నాయకులు పాదయాత్ర మొదలుపెట్టాలి. ఎందుకంటే ఎన్నికలకు గట్టిగా 20 నెలలు కూడా లేవు కాబట్టి.

అయితే ప్రధాన పార్టీల నాయకులకు పాదయాత్ర మీద ఆసక్తి లేనట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. చంద్రబాబును తీసుకుంటే ఆయన ఏమి చేయడానికైనా రెడీవే కానీ వయసు రిత్యా ఆయన పాదయాత్రకు సిద్ధం కావడంలేదు అంటున్నారు. ఆయన వయసు ఇపుడు 73 నడుస్తోంది. ఈ ఏజ్ లో పాదయాత్ర బాబు చేయడం అంటే కష్టమే అని చెప్పాలి. బాబు కూడా పాదయాత్ర కంటే ఇతర మార్గాల ద్వారానే జనాలను కలిసేందుకు ఇష్టపడుతున్నారు అని అంటున్నారు.

ఇక నారా లోకేష్ పాదయాత్ర చేపడతారు అని కూడా ప్రచారం సాగుతోంది. కానీ దాని మీద కూడా క్లారిటీ అయితే లేదు. లోకేష్ సైతం పాదయాత్ర కంటే ఇతర మార్గాల ద్వారానే జనాలకు చేరువ కావచ్చు అన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. పాదయాత్ర నిజానికి రిస్క్ తో కూడుకున్న వ్యవహరం. పైగా ఒకసారి కనుక దిగితే అది పూర్తి అయ్యేంతవరకూ వెనక్కి రాకూడదు. దాంతో వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి అన్ని విధాలుగా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పాదయాత్రకే సమయం పూర్తిగా వెచ్చించడానికి లోకేష్ కూడా ఆలోచిస్తున్నారుట.

ఇక జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆయన పాదయాత్ర చేసేది లేదని క్లారిటీగానే చెప్పేశారు. బస్సు యాత్రకే పవన్ సిద్ధపడుతున్నారు. ఈ మధ్యన మీడియాతో కూడా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర చేసేనే ముఖ్యమంత్రులు అవుతారా అని ఎదురు ప్రశ్నించారు. అంటే పవన్ కి అలాంటి ఆలోచనలు లేవు అని అనుకోవాలి. దీంతో ఈసారి ఎన్నికల ముందర పాదయాత్రల జోరు అయితే కనిపించే అవకాశాలు లేవు అంటున్నారు.

అదే పొరుగున ఉన్న తెలంగాణాలో అయితే వైఎస్సార్ తనయ షర్మిల పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికి పదిహేడు వందల కిలోమీటర్లు నడిచారు కూడా. మరో వైపు బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా పాదయాత్ర చేపట్టారు. విడతల వారీగా ఆయన తెలంగాణా అంతటా పాదయాత్ర చేస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్లాన్ రెడీగా ఉంది. ఆయన తొందరలో చేపడతారు అని అంటున్నారు. దేశ స్థాయిలో చూసుకుంటే రాహుల్ గాంధీ పాదయాత్ర సెప్టెంబర్ 7 నుంచి మొదలు కనుంది.