Begin typing your search above and press return to search.

చంద్రబాబు సాకులు వెతుక్కుంటున్నారా ?

By:  Tupaki Desk   |   6 Nov 2021 5:07 AM GMT
చంద్రబాబు సాకులు వెతుక్కుంటున్నారా ?
X
తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఓటమికి ఇప్పటినుండే చంద్రబాబునాయుడు సాకులు వెతుక్కుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మీడియాతో మాట్లాడుతు అధికార వైసీపీ దౌర్జన్యాలతో స్ధానిక ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. గడచిన 40 ఏళ్ళలో ఎప్పడు కూడా ఇలాంటి ఘోరాలను తాను చూడలేదని తెగ బాధపడిపోయారు. నామినేషన్లే వేయటానికి వెళ్ళిన తమ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేయటం ఏమిటంటే మండిపడ్డారు. కుప్పంలో నామినేషన్ వేయాలని అనుకున్న వెంకటేష్ పై దౌర్జన్యం చేసినట్లు చెప్పారు.

జగన్ పాలనలో ఊరికో ఆంబోతు తయారైనట్లు ఎద్దేవాచేశారు. దౌర్జన్యాలు, దాడులతోనే గెలవాలన్న వైసీపీ నేతల ఆలోచనలను సాగనిచ్చేది లేదంటు వార్నింగిచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నిక ఏదైనా చెదురుమదురు గొడవలు జరగటం మామూలే. కొన్ని చోట్ల పెద్ద గొడవలు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి గొడవలన్నీ ఇపుడే మొదలైనట్లు, రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అసలు గొడవలే జరగలేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటమే విచిత్రంగా ఉంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిన స్ధానికఎన్నికల్లో ఎన్ని గొడవలు జరిగింది అందరికీ తెలిసిందే. స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలిచిన వైసీపీ నేతలను కిడ్నాప్ చేసిన ఘటనలు, కేసులు నమోదుచేసి ఒత్తిళ్ళుపెట్టి పార్టీ మారేట్లు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ జడ్పీటీసీలు ఎక్కువగా గెలిస్తే జిల్లా పరిషత్ ఛైర్మన్ గా టీడీపీ నేతలు ఎలా ఎన్నికయ్యారో చంద్రబాబు చెప్పగలరా ? నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ నేత అజీజ్ ఎన్నికైతే ఆయన టీడీపీలోకి ఎలా ఫిరాయించారో చంద్రబాబు సమాధానం చెబితే బాగుంటుంది. 23 వైసీపీ ఎంఎల్ఏలు టీడీపీలోకి ఎలా ఫిరాయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.

తాము అధికారంలో ఉన్నపుడు చేయాల్సిన కంపంతా చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన చంద్రబాబు ఇపుడు ప్రతిపక్షంలోకి రాగానే అధికారపార్టీపై ఆరోపణలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. రేపటి ఎన్నికలో ఎక్కడకూడా టీడీపీ గెలుస్తుందని బహుశా చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకనే ఇప్పటినుండే సాకులు వెతుక్కుంటున్నట్లుంది. ఎవరు అధికారంలో ఉన్నా జరిగే గొడవలు జరుగుతునే ఉంటాయని అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్యంపై నమ్మకమే లేని చంద్రబాబు ఇపుడు ప్రజాస్వామ్యమంటు గోల చేస్తుండటమే విచిత్రం.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే తాను అధికారంలో ఉంటే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరిగినట్లు, ప్రతిపక్షంలో ఉంటే అంతా దౌర్జన్యాలు, దాడులతో అధికారపార్టీ గెలిచినట్లుగా చంద్రబాబు ఆరోపణలు చేయటమే విచిత్రం. చంద్రబాబు ఇపుడు చేస్తున్న గోలంతా కుప్పం మున్సిపాలిటిలో గెలుపు కోసమే అన్నట్లుంది. మీడియాలో అధికారపార్టీపై ఆరోపణలు చేసినంత మాత్రాన టీడీపీ గెలవదు. క్షేత్రస్ధాయిలో నిలబడి నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకుని పోరాటం చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయి. లేకపోతే ఇలాంటి సాకులే చెప్పుకుంటు కూర్చోవాలి.