Begin typing your search above and press return to search.

బాబు ప్లాన్ - ఉద్యోగులు ఆయ‌న వైపే!

By:  Tupaki Desk   |   7 Feb 2019 9:18 AM GMT
బాబు ప్లాన్ - ఉద్యోగులు ఆయ‌న వైపే!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటున్నారు. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తొలగిపోయేలా ఇటీవ‌ల ఆయ‌న ప‌లు తాయిలాలు ప్ర‌క‌టించారు. బ‌డ్జెట్ లో కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. మ‌హిళ‌ల కోసం ప‌సుపు-కుంకుమ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్ట‌డం, నిరుద్యోగ భృతిని రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల‌కు పెంచ‌డం వంటివి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యాన్ని క‌ట్ట‌బెడ‌తాయ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

ఓటాన్ అకౌంట్‌ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయానికి భారీగా నిధులు కేటాయించ‌డం ద్వారా రైతుల మ‌న‌సు గెల్చుకునే ప్ర‌య‌త్నం చేశారు చంద్ర‌బాబు. రైతులు, మ‌హిళ‌లు, నిరుద్యోగుల‌కు ఇప్ప‌టికే ప‌లు న‌జ‌రానాలు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇక ఉద్యోగుల‌ను త‌న వైపుకు తిప్పుకునేందుకు సీఎం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. వారికి త్వ‌ర‌లోనే ఆయ‌న తాయిలాలు ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డానికి ముందే ఉద్యోగుల‌కు చంద్ర‌బాబు మ‌ధ్యంత‌ర భృతి ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాల‌కు సంబంధించి పే రివిజ‌న్ క‌మిటీ వేయాలి. ఆ త‌ర్వాత మ‌ధ్యంత‌ర భృతి ప్ర‌క‌టించాలి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చాన్నాళ్లుగా ఈ ప్ర‌క్రియ‌ను నిర్లక్ష్యం చేసింది. పెండింగ్ లో ఉన్న ఈ ప్ర‌క్రియ‌ను ఎన్నిక‌ల వేళ అస్త్రంగా వాడుకోవాల‌ని సీఎం భావిస్తున్నార‌ట‌.

సాధార‌ణంగా పే రివిజ‌న్ క‌మిటీని వేసి.. మ‌ధ్యంత‌ర భృతిని ప్ర‌క‌టించేందుకు కొంత స‌మ‌యం తీసుకుంటారు. ఎన్నికల కోడ్ త‌రుముకొస్తున్న నేప‌థ్యంలో ఇలా క‌మిటీని ఏర్పాటుచేసి.. అలా వెంట‌నే భృతి ప్ర‌క‌టించాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు సాధార‌ణంగా ప‌దిశాతానికి కాస్త ఎక్కువ‌గా మ‌ధ్యంత‌ర భృతి ఇస్తుంటారు. ఈ ద‌ఫా చంద్ర‌బాబు ఏకంగా 15-20 శాతం మ‌ధ్యంత‌ర భృతితో పే రివిజ‌న్ క‌మిటీని ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే ఉద్యోగుల వేత‌నాలు భారీగా పెరుగుతాయి. ఫ‌లితంగా వారు టీడీపీకి జై కొట్టే అవ‌కాశముంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.