Begin typing your search above and press return to search.

పార్టీ మారకుండా గంటాకు చంద్రబాబు కళ్లెం

By:  Tupaki Desk   |   30 Oct 2019 4:31 AM GMT
పార్టీ మారకుండా గంటాకు చంద్రబాబు కళ్లెం
X
అంగబలం, ఆర్ధిక బలం, అపార రాకీయ అనుభవం, అన్నింటికీ మించి బలమైన కాపు సామాజిక వర్గం మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సొంతం. ఎన్ని ఉన్నా గత ఎన్నికల్లో తెదేపా ఓటమి పాలవడంతో అధికారానికి దూరమయ్యారు గంటా. మరోవైపు జగన్ తెదేపా నాయకులపై దాడి ముమ్మరం చేస్తున్నారు. వారి అక్రమ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. పాత కేసులు తిరగదోడుతున్నారు. ఇది గంటాకు అశనిపాతంలా మారింది. ఆయనపై వైజాగ్లో పలు భూ ఆక్రమణల ఆరోపణలున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులు గంటాపై పలు అవినీతి ఆరోపణలు చేసారు. ఈ క్రమంలో ఒకవేళ జగన్ గనక రంగంలోకి దిగితే తన వ్యాపారాల విస్తరణకే కాదు రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరమని గంట సన్నిహితుల వద్ద చర్చించినట్టు సమాచారం. ఈ గండం నించి గట్టెక్కడానికి వైకాపా తీర్థం పుచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే గంటా పార్టీ మారడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

గంటా ఆలోచనను తెదేపా అధినేత చంద్రబాబు ముందే పసిగట్టారట. గంటా పోతే అది ఉత్తరాంధ్ర మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అతన్ని ఆపడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందులో భాగంగా గంటా అవినీతి సంపాదనకు సంపాదించి పూర్తి సాక్ష్యాధారాలతో ఓ దస్త్రం తయారు చేయించే పనిలో ఉన్నారట చంద్రబాబు. తెదేపాను కాదని వైకాపా వైపు వెళ్తే ఎలా ఇరికించాలో పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని సమాచారం. స్వయంగా పార్టీ తరఫున ఇరికించడానికి ఇబ్బందిగా అనిపిస్తే... దీనికోసం అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సాయం కూడా తీసుకోవడానికి చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.

గతంలో భాజపాతో చెలిమిగా ఉన్న సమయంలో కేంద్ర నిఘా సంస్థలు, సిబిఐ అధికారులతో ఎలాగూ మంచి పరిచయాలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుత సెంట్రల్ విజిలెన్సు కమిషనర్ కేవీ చౌదరి బాబుకి అత్యంత సన్నిహితుడని పేరుంది. కష్టకాలంలో గంటా తన స్వార్ధం కోసం తన దారి తాను చూసుకుని, తెదేపాకి ద్రోహం చేస్తూ పార్టీ మారితే అతడి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడానికి చంద్రబాబు వెనుకాడకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో గంటా పార్టీ మారాలని అనుకుంటున్నా అదంత తేలికయ్యే వ్యవహారంలా కనిపించడం లేదు.