Begin typing your search above and press return to search.

అమిత్ షాతో చంద్ర‌బాబు మీటింగ్.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

By:  Tupaki Desk   |   21 Aug 2022 2:30 AM GMT
అమిత్ షాతో చంద్ర‌బాబు మీటింగ్.. ఏం జ‌ర‌గ‌బోతోంది?
X
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న అనేక సంచ‌ల‌నాల‌కు వేదిక కాబోతుందా అంటే అవున‌నే అంటున్నారు.. విశ్లేష‌కులు. ఆగ‌స్టు 21 అమిత్ షా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని మునుగోడుకు రానున్నారు. ఆయ‌న స‌మ‌క్షంలో ఇటీవ‌ల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే మునుగోడులో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లోనూ అమిత్ షా ప్ర‌సంగిస్తారు.

ఆ త‌ర్వాత ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం అయితే.. అమిత్ షా మునుగోడు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో హైద‌రాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి ప్ర‌యాణించాల్సి ఉంటుంది. అయితే అమిత్ షా ప‌ర్య‌ట‌న‌లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయ‌ని చెబుతున్నారు. ఆయ‌న మునుగోడులో ప‌ర్య‌టించాక రోడ్డు మార్గంలో ప్ర‌యాణించి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అక్క‌డ ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావుతో భేటీ అవుతార‌ని సమాచారం. అయితే ఈ భేటీకి ఇంకో విశేషం కూడా ఉంద‌ని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఈ భేటీలో అమిత్ షాతో స‌మావేశ‌మ‌వుతార‌ని చెబుతున్నారు. తెలంగాణ‌లో వచ్చే ఏడాది, ఆంధ్ర‌ప్ర‌దేశ్లో 2024లో ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీతో క‌లిసి రెండు రాష్ట్రాల్లో పోటీ చేయ‌డానికి చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. అమిత్ షాతో భేటీ సంద‌ర్భంగా త‌న కోరిక‌ను చంద్ర‌బాబు ఆయ‌న వ‌ద్ద వ్య‌క్తం చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కాగ‌ల కార్యం గంధ‌ర్వులు తీర్చిన‌ట్టు మిగ‌తా ప‌ని పూర్తి చేయ‌డానికి ఎలాగూ రామోజీరావు ఉన్నార‌ని చెబుతున్నారు.

ప‌నిలో ప‌నిగా రామోజీరావును వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు మీడియా ప‌రంగా స‌హ‌క‌రించాల్సిందిగా అమిత్ షా కోర‌తార‌ని చెప్పుకుంటున్నారు. మ‌రోవైపు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని.. అప్ప‌టి నుంచి బీజేపీతో ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి ఇటీవ‌ల కాలంలో మారింద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నికల్లో బీజేపీకి ఏక‌ప‌క్షంగా చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు. అలాగే పార్ల‌మెంటులో వివిధ బిల్లులు ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు కూడా టీడీపీ.. బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాల‌నేది చంద్ర‌బాబు ప్లాన్ అని చెబుతున్నారు. గ‌తంలో 1999లో, 2004లో, 2014లోనూ చంద్ర‌బాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. 1999, 2004లో గెలుపొందిన ఆయ‌న 2004లో మాత్రం ఓడిపోయారు.

ఇక తెలంగాణ‌లో బీజేపీకి టీడీపీ స‌హ‌క‌రించేట్టు, ఏపీలో టీడీపీకి బీజేపీ స‌హ‌క‌రించేట్టు ఒప్పందం చేసుకుంటున్నార‌ని.. ఇదే విష‌యాన్ని అమిత్ షాతో చంద్ర‌బాబు ప్ర‌స్తావిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.