Begin typing your search above and press return to search.

30వ టూర్ ఎవ‌రి ఖాతాలో వేస్తారు బాబు?

By:  Tupaki Desk   |   3 April 2018 5:37 AM GMT
30వ టూర్ ఎవ‌రి ఖాతాలో వేస్తారు బాబు?
X
చెప్పిందే చెప్ప‌టం.. ఎదుటోడికి ఏ మాత్రం ఆస‌క్తి లేకున్నా అదే ప‌నిగా చెప్ప‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సిద్ద‌హ‌స్తుడు. ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కుండానే చాలానే చేస్తున్న‌ట్లు బిల్డ‌ప్ ఇవ్వ‌టంలో బాబుకు మించినోళ్లు లేర‌నే చెప్పాలి. నాలుగేళ్లు మోడీ స‌ర్కారుకు మిత్రుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇటీవ‌ల క‌టీఫ్ చెప్ప‌టం తెలిసిందే.

మిత్రుడిగా ఉన్న వేళ‌.. 29సార్లు ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న‌కు మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చింది త‌క్కువ‌సార్లే.

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. హోదా సాధ‌న కోసం బాబు దేశ రాజ‌ధానికి వెళ్లారా? అంటే లేద‌నే చెప్పాలి. మోడీతో క‌టీఫ్ చెప్పేంత‌వ‌ర‌కూ హోదా అవ‌స‌ర‌మే లేద‌న్న పెద్ద‌మ‌నిషి.. హోదా కోసం చెప్పులు అరిగేట‌ట్లు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి విన్న‌వించినా ప‌ట్టించుకోలేద‌న్న మాట‌లో నిజం కంటే అబ‌ద్ధ‌మే ఎక్కువ‌ని చెప్పాలి.

వాస్త‌వానికి హోదాతోనే ఏపీకి ఉన్న స‌మ‌స్య‌లు తీర‌తాయ‌న్న మాట చెప్పిన వారిపై బాబు ఎంతలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారో మ‌ర్చిపోకూడ‌దు. హోదా సాధ‌న కోసం ఉద్య‌మిస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని మ‌ర్చిపోలేం. విభ‌జ‌నతో విల‌విల‌లాడుతున్న రాష్ట్రాన్ని నిర‌స‌న‌ల‌తో ఏం చేద్దామ‌నుకుంటున్నారు? అంటూ ప్ర‌శ్నించి ఉద్య‌మ‌స్ఫూర్తిని అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేశార‌న్న‌ది నిజం.

అలాంటి చంద్ర‌బాబు.. ఈ రోజు అదే ప‌నిగా తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని సంప్ర‌దింపులు జ‌రిపినా ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని ప‌ట్టించుకోలేద‌ని.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న త‌న వాద‌న‌ను విన‌లేద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. ఇప్పుడు మాట్లాడుతున్న చందంగా.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో మాట్లాడాలిగా.. కేంద్రంపై విమ‌ర్శ‌లు చేయాలిగా? అన్న ప్ర‌శ్న‌కు తెలుగు త‌మ్ముళ్లు స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి.

తాజాగా త‌న 30వ ఢిల్లీ టూర్ ను చేస్తున్నారు చంద్ర‌బాబు. ఈ టూర్ ఎందుక‌న్న‌ది చూస్తే.. పైకి చెప్పే మాట‌ల‌కు.. లోప‌ల జ‌రుగుతున్న త‌తంగానికి సంబంధం లేద‌ని చెబుతున్నారు. తాజాగా బాబు ఢిల్లీ టూర్ చూస్తే.. ఆయ‌న ఎందుకు వెళుతున్నారో ఒక్క మాట‌లో చెప్ప‌లేని ప‌రిస్థితి. హోదా కోసం ఉద్య‌మిస్తున్న‌ట్లుగా చెప్పే బాబు.. ప‌లు పార్టీ నేత‌ల‌తో భేటీ అయి ఏం చేయాల‌నుకుంటున్నారు? అన్న ప్ర‌శ్నకు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు తెర మీద‌కు వ‌స్తాయి.

మోడీతో దోస్తానా చెడిన నేప‌థ్యంలో.. ఆయ‌న ప్ర‌భుత్వం చేసిన త‌ప్పొప్పుల మీద మోడీ అండ్ కో క‌న్నేసిన‌ట్లుగా తెలుస్తోంది. హోదా పేరుతో త‌న‌ను డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న బాబుకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌న్న త‌లంపులో ఉన్న ఢిల్లీ పెద్ద‌లు ఆ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు బాబుకు తెలీటం..దానికి త‌గ్గ‌ట్లు కొత్త జ‌ట్టు క‌ట్టేందుకే తాజా ఢిల్లీ టూర్ అన్న మాట వినిపిస్తోంది.

ఇదంతా చూసిన‌ప్పుడు బాబు నిత్యం చెప్పే మాట‌లకు ఆయ‌న చేత‌ల‌కు ఏ మాత్రం సంబంధం ఉండ‌ద‌న్న విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మ‌వుతుంది. హోదా సాధ‌న కోసం ఎంత‌కైనా స‌రే అని చెప్పే బాబు.. త‌న ఢిల్లీ టూర్ సంద‌ర్భంగా వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌తో భేటీ కావ‌టం వెనుక‌.. త‌న బ‌ల‌మెంత ఉంద‌న్న విష‌యాన్ని కేంద్రానికి చూపించే ప్ర‌య‌త్నం త‌ప్పించి మ‌రింకేమీ లేద‌ని చెప్పాలి. బాబు స‌ర్కార్ అవినీతిపై మోడీ ప్ర‌భుత్వం దృష్టి సారించిన‌ప్పుడు.. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న దాన్ని జీర్ణించుకోలేక‌నే కేంద్రం త‌న‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌న్న భావ‌న క‌లిగించేందుకే తాజా ఢిల్లీ టూర్ గా చెబుతున్నారు.

ఇదంతా చూస్తున్న‌ప్పుడు బాబు ఢిల్లీ టూర్ మొత్తం ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే త‌ప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల బాగోగుల కోసం.. వారి ఆశ‌లు.. ఆకాంక్ష‌ల్ని నెర‌వేర్చేందుకు ఎంత‌మాత్రం కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. సొంత ప్ర‌యోజ‌నాల కోసం చేసే 30వ ఢిల్లీ టూర్ కూడా రానున్న రోజుల్లో హోదా ఖాతాలో వేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.