Begin typing your search above and press return to search.

కేసీఆర్ అడిగింది చంద్రబాబు ఇస్తున్నారా?

By:  Tupaki Desk   |   9 April 2016 7:49 AM GMT
కేసీఆర్ అడిగింది చంద్రబాబు ఇస్తున్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తనను కోరిన కోరికను ఏపీ సీఎం చంద్రబాబు తీర్చనున్నారా...? ఆయన అభ్యర్థనను మన్నించి అడిగింది ఇచ్చేస్తున్నారా...? అంటే అవుననే అనిపిస్తున్నాయి పరిస్థితులు. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన గ్రామాలను మళ్లీ తెలంగాణకు ఇవ్వాలని కేసీఆర్ చంద్రబాబును కోరగా అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. విలీన గ్రామాలకు సంబంధించిన అన్ని వివరాలపై జరుగుతున్న అధికారిక కసరత్తు ఆధారంగా వాటిని తిరిగి తెలంగాణకు ఇస్తున్నారన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.

రాష్ట్ర విభజన సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాలలోని పలు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌ లో కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని భద్రాచలం మండలంలోని ఆరేడు గ్రామాలు ఏపీలో కలవడం వల్ల భద్రాద్రి ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే విషయాన్ని స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సున్నం రాజయ్య - వివిధ పార్టీలకు చెందిన నాయకులు - స్థానికులు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భద్రాద్రి నుంచి తమల్ని వేరు చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తాము తెలంగాణలోనే ఉంటామన్నారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒక అడుగు ముందుకేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. భద్రాదిని ఆనుకుని ఉన్న గ్రామాలు ఏపీలో విలీనం కావడం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా..సమస్యను విన్న చంద్రబాబు ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు సుముఖతను వ్యక్తం చేశారని తెలుస్తోంది. విలీన గ్రామాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇది త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో కలిసిన గ్రామాలు తిరిగి తెలం గాణలో కలిపేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు మాట్లాడుకోవడం.. అధికా రులు ఆదిశగా కసరత్తు చేస్తుండటంతో భద్రాది పరిసర ప్రాంతంలోని ఆరేడు గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ముంపు తదితర అంశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, తెలంగాణ నుంచి మళ్లీ ఇబ్బందులు రాకుండా ఏపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని తిరిగి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.