Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ ను అభివృద్ధి చేసినందుకు బాబు బాధ ప‌డుతున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   23 July 2019 9:01 AM GMT
హైద‌రాబాద్ ను అభివృద్ధి చేసినందుకు బాబు బాధ ప‌డుతున్నార‌ట‌!
X
ఎప్పుడేం మాట్లాడాలో తెలీన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు. త‌న మాట‌ల‌తో అంద‌రిని దూరం చేసుకునే బాబు.. తాజాగా మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. త‌ర‌చూ హైద‌రాబాద్ అభివృద్ది త‌న పుణ్య‌మేన‌ని.. తాను నిర్మించిన హైటెక్ సిటీ కార‌ణంగానే హైద‌రాబాద్ ఇంత అభివృద్ధి చెందిన‌ట్లుగా చెప్పుకోవ‌టం తెలిసిందే.

ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబు తాజాగా మాట్లాడ‌కూడ‌ని మాట‌ను మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. హైద‌రాబాద్ అభివృద్దికి తానే కార‌ణ‌మ‌ని గొప్ప‌లు చెప్పుకునే బాబు.. తాజాగా మాత్రం హైద‌రాబాద్ ను అభివృద్ధి చేసినందుకు తాను ప‌శ్చాత్తాప‌ప‌డుతున్న‌ట్లుగా వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. సుదీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసినా.. తెలంగాణ మీద‌నే ఎక్కువ‌గా దృష్టి కేంద్రీక‌రించాన‌ని ఆయ‌న చెప్పుకున్నారు.

ఉమ్మ‌డి ఏపీని వ‌దిలి హైద‌రాబాద్ ను అభివృద్ధి చేసినందుకు తాను బాధ ప‌డుతున్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేసిన తీరు బాబుకు కొత్త క‌ష్టాన్ని తేవ‌టం ఖాయ‌మంటున్నారు.ఇప్ప‌టికే తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంది. తెలంగాణ‌లో బాబు పేరెత్తితేనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. ఇప్పుడన్న మాట‌తో.. పార్టీకి మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఖాయ‌మంటున్నారు.

హైద‌రాబాద్ అభివృద్ధిపై తాను చేసిన వ్యాఖ్య ఆయ‌న రాజ‌కీయ జీవితంలో చేసిన ఖ‌రీదైన త‌ప్పుగా మారే ప్ర‌మాదం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. హైద‌రాబాద్ అభివృద్ధి చేసిన దానిపై గ‌తంలో చెప్పిన దానికి భిన్న‌మైన వ్యాఖ్య‌ను చంద్ర‌బాబు చేయ‌టంలో అర్థం లేద‌ని చెప్పాలి. ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌ధానిగా హైద‌రాబాద్ ను అభివృద్ది చేయ‌టం ఎందుకు త‌ప్పు అవుతుంది?

రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణం హైద‌రాబాద్ అభివృద్ధి కాదు క‌దా? నీళ్లు.. నిధులు.. నియ‌మ‌కాల విష‌యంలో తెలంగాణ స‌మాజానికి జ‌రిగిన అన్యాయ‌మే విభ‌జ‌న కార‌ణ‌మైంది. ఇలాంటప్పుడు హైద‌రాబాద్ ను అభివృద్ధి చేయ‌టం త‌ప్పెలా అవుతుందో చంద్ర‌బాబుకే తెలియాలి. నిజానికి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో తెలంగాణ ప్రాంతీయులు ఉన్న‌ట్లే.. సీమాంధ్ర‌కు చెందిన వారు ల‌క్ష‌లాదిగా ఉన్నారు. హైద‌రాబాద్ అభివృద్ధి కార‌ణంగా వారి ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఎక్క‌డి దాకానో ఎందుకు? చంద్ర‌బాబును.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల సంగ‌తే చూస్తే.. ఆయ‌న నివాసం.. ఫాం హౌస్ అన్ని హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. చివ‌ర‌కు ఆయ‌న హెరిటేజ్ కంపెనీ కూడా. ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో అమ‌రావ‌తి ప్రాంతంలో చంద్ర‌బాబుకు సొంతిల్లు లేకున్నా.. హైద‌రాబాద్ లో ఉన్న పాత ఇంటిని కూల‌దోసి.. కోట్లాది రూపాయిల ఖ‌ర్చుతో కొత్తిల్లు క‌ట్టుకోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇలా తాను.. త‌న కుటుంబం కూడా హైద‌రాబాద్ అభివృద్ధి కార‌ణంగా లాభప‌డింద‌న్న విష‌యాన్ని బాబు ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు? నిరాశ.. నిస్పృహ‌లో ఉన్న‌ప్పుడు నోటి వెంట నుంచి వ‌చ్చే మాట‌ల్లో త‌ప్పులు దొర్లుతుంటాయి. ఆ విష‌యాన్ని బాబు మిస్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ త‌ర‌హా స్టేట్ మెంట్ల కార‌ణంగా రాజ‌కీయ‌ ప్ర‌యోజ‌నం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌గా ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇంత‌కీ.. ఇంత దారుణ‌మైన స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం బాబుకు ఉందంటారా? నెత్తిన పెద్ద‌మ్మ కూర్చుంటే ఇలాంటి మాట‌లే వ‌స్తాయి మ‌రి.