Begin typing your search above and press return to search.
వైఎస్ ఘనతను ఒప్పుకున్న చంద్రబాబు
By: Tupaki Desk | 26 Jun 2018 11:56 AM GMTగద్దెనెక్కిన చంద్రబాబు, కేసీఆర్ లు ఇప్పుడు సొంత డబ్బా కొట్టుకుంటూ చలామణీ అవుతున్నారు. అభివృద్ధి పేరిట ఊదరగొడుతున్నారు. కానీ నిజం మాత్రం ఎప్పటికైనా బయటపడుతుంది. అదే మరోసారి బహిర్గతమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా చేసిన సమయంలో జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పుడు ఆయన మొదలు పెట్టినవే.. ‘ప్రాణహిత -చేవెళ్ల’ - ‘పోలవరం’ ప్రాజెక్టులు.. వైఎస్ అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ ప్రాజెక్టులు పూర్తికాలేకపోయాయి.
ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోవడం.. అంతకుముందు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ప్రాజెక్టులు పట్టాలెక్కలేవు. తెలంగాణ - ఏపీ విడిపోయాక ఇప్పుడు చంద్రబాబు - కేసీఆర్ లు వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చి ‘కాళేశ్వరం’ - పోలవరంకు కొత్త సొబుగులు అద్దారు. వైఎస్ తవ్వించిన కాలువలనే వాడుకొని చంద్రబాబు వట్టిసీమ - పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. నదుల అనుసంధానం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ‘పోలవరం.. నరేంద్రమోడీ వరం’ అని స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో గుస్సా అయిన చంద్రబాబు అది ‘మోడీ వరం ’ కానే కాదు.. ‘కాంగ్రెస్ హయాంలో మొదలైంది. కాంగ్రెస్ పార్టీనే ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.’ అంటూ కొత్త రాగం అందుకున్నాడు.
ఎప్పుడూ కాంగ్రెస్ అంటే గిట్టని చంద్రబాబు మోడీపై కోపంతో అసలు నిజం బయటపెట్టేసరికి అంతా అవాక్కయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైందన్న విషయాన్ని బాబు పరోక్షంగా ఒప్పుకోవడం ఇప్పుడు వైసీపీకి కొండంత బలంగా మారింది. బాబును పోలవరం విషయంలో ఇరుకున పెట్టే అవకాశాన్ని స్వయంగా చంద్రబాబే ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీన్నిబట్టి వైఎస్ జగన్ అన్నట్టు ఏపీలో ప్రాజెక్టులకు కర్త - కర్మ - క్రియా వైఎస్ ఆర్ అని మరోసారి నిరూపితమైంది.