Begin typing your search above and press return to search.

రాజధాని కోసం.. బాబు పటిష్ట వ్యూహం

By:  Tupaki Desk   |   14 Oct 2015 4:01 AM GMT
రాజధాని కోసం.. బాబు పటిష్ట వ్యూహం
X
ఆంద్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది? సర్కారు వద్ద అసలేం నిధులున్నాయి. కేంద్రం ఎంత ఇవ్వబోతోంది. చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా ప్రజల నుంచి విరాళాలు అసలొస్తాయా? వస్తే గనుక.. ఇంత పెద్ద రాజధాని నిర్మాణంలో అవి ఏమూలకు సరిపోతాయి వంటి అనేక సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి. బయట ఉన్న మనకే ఇన్ని సందేహాలు ఉంటే.. ఆ కార్యభారానికి పూనుకున్న ప్రభుత్వానికి ఇంకెంత జాగరూకత ఉంటుంది. అందుకే చంద్రబాబునాయుడు సర్కారు.. ఒక నిధులను కూడా సమీకరించగల ఒక మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేసుకునే ప్రక్రియ ద్వారా.. నగర నిర్మాణానికి పూనుకుంటోంది.

ఎంపిక చేసిన ఒక మాస్టర్ డెవలపర్ చేతిలో పడనుంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించే వెయ్యేళ్ల రాజధానికి కావలసిన సమస్త సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ - కౌన్సిల్ - సచివాలయం - హైకోర్టు - వంటి భవంతుల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల మేరకు శాసనసభ వంటి నిర్మాణాలకు కేంద్రమే ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.

ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించిందని, అభివృద్ధి చేస్తున్న భూమిలో వారికి ప్రయోజనాలు కలిపిస్తానని బాస చేసిందని పరకాల అన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతి ద్వారా మాస్టర్ డెవలపర్‌ ని ఎంపిక చేస్తామని, కంపెనీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో మదుపు చేస్తుందని తెలిపారు.

అయితే మాస్టర్ డెవలపర్ అంటే బిల్డర్ కాదని, అతడు పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు తీసుకువస్తారని పరకాల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా దాని సంస్థలకు కూడా వాటా ఉన్నందున అవి కూడా రాజధాని నిర్మాణం నుంచి లాభాలు పొందుతాయని తెలిపారు. ప్రభుత్వ భవనాల నిర్మాణంతోపాటు, ఆర్థిక వ్యవస్థను ఉరకలెత్తించడానికి విద్యా - ఆరోగ్యం - వినోదం - క్రీడలు వంటి అవసరాలకు కూడా నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని పరకాల వివరించారు.

మొత్తానికి మన వద్ద ఉన్న ఆర్థిక వనరులు శూన్యం అయినప్పటికీ.. అమరావతి రాజధానిని మాత్రం అనుకున్న రీతిలోనే తిరుగులేని విధంగా నిర్మించడానికి చంద్రబాబు ప్రభుత్వం వ్యూహత్మకంగా ముందుకు వెళుతోంది. మాస్టర్ డెవలపర్ ద్వారా నిధుల సమీకరణ బాధ్యతను కూడా వారికే వదలి.. నగర నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నమాట.